తెలుగు సినిమా ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన రెబల్ స్టార్ కృష్ణం రాజు రాజకీయ నాయకుడిగానూ తనదైన ముద్ర వేశారు..వాజ్ పేయ్ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు .
కృష్ణంరాజు తొలుత 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాదిలో నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్ రాజు చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 1998లో 13వ లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించారు.
1999 మధ్యంతర ఎన్నికలు రావడంతో అప్పుడు కూడా నర్సాపురం లోక్‌సభ నుండి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజుపై గెలుపొందారు. అలా కేంద్రంలోని అటల్ బిహారీ వాజ్ పేయీ ప్రభుతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.
2004 లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అదే స్థానం నుండి బీజేపీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి జోగయ్య చేతిలో ఓటమి చెందారు. మార్చి 2009లో బీజేపీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు.ఆ సమయంలో వచ్చిన ఎన్నికల్లో రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు.
అయితే ఆ ఎన్నికల్లో కృష్ణం రాజుకు పరాజయం ఎదురైంది. తరువాత మళ్లీ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ పలు కారణాల వల్ల ఆయన యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు.
రెబల్ స్టార్ కృష్ణం రాజు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు గ్రామంలో 1940లో కృష్ణం రాజు జన్మించారు. తన 83వ ఏటా తెలుగు సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచి తిరిగిరాని లోకానికి విడిచి వెళ్లిపోయారు.
కృష్ణంరాజు మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
సెన్సార్ బోర్డుపై వర్మ ఫైర్ : ఎంతగా ఆపితే అంతగా పైకి లేస్తా… సీక్వెల్ కూడా…!