telugu navyamedia
తెలంగాణ వార్తలు

యాదాద్రి పునః ప్రారంభం: స్వయంభువుకు తొలిపూజ చేసిన సీఎం కేసీఆర్

యాదాద్రిలో లక్ష్మినరసింహస్వామి ఆలయం పునః ప్రారంభమైంది.లక్ష్మీ నర్సింహుడికి సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజ చేశారు. ఆరేళ్ల తర్వాత యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి  గర్భాలయంలోని మూలవిరాట్ నిజరూపంలో దర్శనమిచ్చారు.

 ఉదయం 9గంటలకు మొదలైన మహాపూర్ణాహుతితో సంప్రోక్షణ ఉత్సవాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొన్నారు.

తొలుత ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ వైభవంగా జరిగింది. ఏడు రాజగోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏకకాలంలో 92 మంది రుత్వికులతో సీఎం కేసీఆర్​తో పాటు మంత్రులు కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. వేదమంత్రోచ్ఛరణ నడుమ సంప్రోక్షణ క్రతువు వైభవోపేతంగా జరిగింది.

 గర్భాలయంలో తొలి పూజ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన సతీమణి శోభ. అక్కడి నుంచి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

మహాకుంభ సంప్రోక్షణ మహోత్సవం తర్వాత ప్రధాన ద్వారం నుంచి సీఎం కేసీఆర్, మంత్రులు ప్రధానాలయంలోని మండపంలోకి ప్రవేశం చేశారు.. ఉపాలయాల్లో ప్రతిష్ఠా మూర్తులకు మహా ప్రాణన్యాసం నిర్వహించారు. స్వయంభువుగా వెలసిన స్వామివారికి
సీఎం కేసీఆర్​ దంపతులు స్వామివారికి తొలి పూజ చేశారు.

 అటుపై 12.10గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశం చేశారు సీఎం కేసీఆర్. అలాగే గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నారు.

అనంతరం అర్చకులు ఆరగింపు సేవ చేశారు. తర్వాత తీర్థ, ప్రసాద గోష్టి జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. 

 వైటీడీఏ, దేవస్థానం సీఎం కేసీఆర్‌ను వైస్‌ ఛైర్మన్‌ కిషన్‌రావు, ఈవో ఘనంగా సన్మానించారు.

అలాగే  యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న వారిని సీఎం కేసీఆర్‌ సన్మానించారు. ఆర్కిటెక్‌ ఆనందసాయి, ప్రధాన స్తపతి సుందర్‌ రాజన్‌, ఈవో గీతారెడ్డి, రుత్వికులు, పూజారులను సీఎం సన్మానించారు.

 సోమవారం పంచకుండాత్మక మహాయాగంలో మహాపూర్ణాహుతికి ముహుర్తం పెట్టడంతో ఆదివారం రాత్రి నుంచే బాలాలయంలో దర్శనాలను నిలిపి వేశారు.

Related posts