telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రాజబాబు – నిజమైన స్నేహానికి మరో పేరు

పది మంది కోసం బ్రతికిన మనిషి పోయిన తరువాత ఆ పది మందీ అతని మధుర స్మృతులను పంచుతూ , పెంచుతూ వుంటారు. నటుడు రాజబాబు ఈ కోవకు చెందిన వాడు. రాజబాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా అతని జ్ఞాపకాలను స్నేహితులు మర్చిపోలేదు. రాజబాబు జయంతి రోజును వేడుకగా నిర్వహిస్తూ, అతను వచ్చిన నాటక రంగం , టీవీ మాధ్యమం , సినిమా రఁగంలోని ప్రతిభావంతులను సత్కరిస్తున్నారు .


ఇది కేవలం రాజబాబును స్మరించుకోవడం మాత్రమే కాదు , సహా నటీ నటులకు ఆర్ధికంగా చేయూతనివ్వడం కూడా . రాజబాబు అంటే అటు కుటుంబ సభ్యులకే కాదు ఆయనతో అనుబంధం వున్న కాకాని బ్రహ్మం నర్రా వెంకట రావు, వేములపల్లి కుమార్, రావిపాటి నాగేశ్వర రావు, బాలాజీ, నా లాంటి మిత్రులందరికీ మంచి స్నేహశీలి. మానవతావాది .
మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు పెద్దలు. ఈ సూత్రాన్ని రాజబాబు బాగా వంటపట్టించుకున్నాడు. ఎంత పేరు సంపాదించినా బంధువులు, స్నేహితులతో చాలా ఆత్మీయంగా మెలిగేవాడు. అందరిలో ఒకడిగా కలసిపోయేవాడు. ఆయనలో అహం , అహంకారం ఎప్పుడూ రాలేదు . అదే రాజబాబు ప్రత్యేకత.
రాజబాబు , తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నరసాపురపేటలో 1957న జన్మించారు. రాజబాబు తండ్రి రామతారకం . తల్లి అనంత లక్ష్మి సరస్వతీదేవి. దాసరి నారాయణ రావు గారు దర్శకత్వం వహించిన “స్వర్గం నరకం “, “దేవుడు చేసిన పెళ్లి ” , సినిమాల నిర్మాతల్లో రామతారకం గారు ఒకరు.
రాజబాబు చిన్నప్పటి నుంచి హాస్యప్రియుడు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు విరపూస్తాయి , స్నేహ మాధుర్యం పరిమళిస్తుంది. రాజబాబు కు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం . ఎక్కడ నాటకం ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతాడు . ఆ ఇష్టం , అభిమానమే ఆయన్ని రంగస్థలం మీదకు తీసుకు వచ్చింది. మొదటగా “ఊరుమ్మడి బతుకులు ” నాటకంలో రాజబాబు నటించారు . ఆయన నటనను అందరూ మెచ్చుకున్నారు . స్నేహితులైతే రాజబాబును సహజమైన నటుడంటూ ప్రశంసలు కురిపించారు . ఆ స్పూర్తితో “పుటుక్కు జర జర డుబుక్కు మే “, పూజకు వేళాయెరా ” నాటకాల్లో తన ప్రతిభను చాటుకున్నారు .


నాటక రంగంలో అనేక పాత్రల ద్వారా పేరు సంపాదించిన రాజబాబు 1995లో సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. రాజబాబు ఈ జీవితాన్ని ఊహించలేదు . ఇది అనుకోకుండా వచ్చిన అవకాశం . రాజబాబుకు చిన్ననాటి స్నేహితుడు దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు. శ్రీకాంత్ హీరోగా ఆయన దర్శకత్వం వహించిన “వూరికి మొనగాడు” చిత్రంలో రాజబాబుకు ఓ వేషం ఇచ్చారు. ఆ సినిమా రాజబాబు ను వెండితెర వైపు తన ప్రయాణాన్ని కొనసాగేలా చేసింది . ఆ తరువాత “సిందూరం “, మురారి “, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే”, “శ్రీకారం ‘, “సముద్రం “, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు “, “కళ్యాణ వైభోగం “, మళ్ళీరావా ?”, “భరత్ అనే నేను ” మొదలైన చిత్రాల్లో రాజబాబు అనేక పాత్రల్లో నటించి మెప్పించారు.
ఆ తరువాత రాజబాబు ప్రయాణం టీవీ లో కూడా కొనసాగింది . “అభిషేకం “, “వసంత కోకిల “, “రాధా మధు “, “మనసు మమత”, “బంగారు కోడలు “, “బంగారు పంజరం “, “చి. ల .సౌ స్రవంతి ” , “ప్రియాంక ” లాంటి సీరియళ్ళలో విలక్షణమైన పాత్రలను పోషించారు.
ఈనెల 13న రాజబాబు గారి 66వ జయంతి. ఆయన జన్మించి , నాటకాల్లో పేరు తెచ్చుకున్న కాకినాడలో జరుపుతున్నారు


రాజబాబుతో ఒక్కసారి పరిచయం ఏర్పడితే అది జీవిత కాలం కొనసాగవలసిందే. గోదావరి ప్రాంత యాస, స్వచ్ఛమైన తెలుగు భాష మాత్రమే కాదు, అభిమానం, ఆత్మీయత కలబోసుకున్న నికార్సయిన స్నేహపాత్రుడు రాజబాబు .
రాజబాబు స్వతహాగా హాస్యప్రియుడు , ఆయన ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల పువ్వులు విరపూస్తాయి, స్నేహ మాధుర్యం పరిమళిస్తుంది. రాజబాబు భౌతికంగా మన మధ్య లేరు . కానీ ఆయన జ్ఞాపకాలు కుటుంబ సభ్యులు , స్నేహితుల మనస్సులో పదిలంగా వున్నాయి .

-భగీరథ
సీనియర్ జర్నలిస్ట్

Related posts