ఇటీవల కేంద్రప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా అయిదు ఎకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులకు కేంద్రప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఏటా 6000 రూపాయలను చెల్లిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలోమూడు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. ఒక్కో త్రైమాసికంలో 2000 రూపాయల చొప్పున మొత్తాన్ని అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. గోరఖ్‌పూర్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించబోయే బహిరంగ సభలో ప్రధాని ఈ పథకాన్ని ప్రకటించబోతున్నారు.
ఈ పథకం కిందికి దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు వస్తారని కేంద్రం అంచనా వేసింది. ఈ పథకం ప్రారంభమైన వెంటనే.. కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 2000 రూపాయలు జమ అవుతాయి. దీనికి సంబంధించిన విధి విధానాలన్నీ పూర్తి చేసింది కేంద్రం. అర్హులైన రైతుల ఎంపిక కూడా పూర్తయింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పోర్టల్ ను కూడా ప్రారంభించింది. అర్హులైన రైతుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే ఈ పోర్టల్ ద్వారా కేంద్రానికి అందజేశాయి. వాటి ఆధారంగా కేంద్రం నిధులను బదిలీ చేయనుంది. తొలిదశలో కోటి మంది, మలి దశలో మిగిలిన రైతుల ఖాతాల్లో మరో వారం రోజుల్లోగా ఈ మొత్తం జమ అవుతుంది. గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ పథకం అమల్లోకి తెచ్చినట్టుగా కేంద్రం చూపిస్తోంది. అందుకే 2018-19 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించిన 2000 రూపాయల బకాయిలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు చెబుతోంది.