telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంత్రి పేర్ని నానితో ఆర్. నారాయణమూర్తి భేటీ

ఏపీలో గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు జగన్ సర్కార్ వర్సెస్ టాలీవుడ్ ఇండస్ట్రీ వార్ గా మారింది.టికెట్ ధరలను తగ్గించారంటూ సినీ పెద్దలు ,  సీనీ హీరోలు నాని, సిద్దార్ద్ లు అసహనం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే..

టికెట్ల అంశంపై ఈ మధ్య ఓ సినీ వేదికపై స్పందించిన నారాయణ మూర్తి ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని బహిరంగంగా విజ్ఞ‌ప్తి చేశాడు. 

ఈ క్ర‌మంలో మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి,  సీల్‌ చేసిన థియేటర్ల యజమానులతో కలిసి వెళ్లి భేటీ కావడం.. ప్రాధాన్యత సంతరించుకుంది.  థియేటర్లు మూసివేత, టికెట్‌ రేట్లపై వీరు చ‌ర్చ‌లు జ‌రిపారు. 

ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. సీజ్‌ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్‌ చేసేందుకు అనుమతిచ్చారు. అయితే థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అందుకుగానూ నెలరోజుల గడువు ఇచ్చారు.

మంత్రి హామీతో 9 జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించనుంది. సడలింపులపై జాయింట్‌ కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఆదేశాలిచ్చారు.

అయితే ఈ సమావేశానికి వెళ్ళే ముందు నారాయణ మూర్తి మాట్లాడుతూ.. కొన్ని విషయాలు పర్సనల్ గా అడిగి తెలుసుకునేందుకు మంత్రి వద్దకు వచ్చానని పేర్కొన్నారు. 

కాగా.. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమ‌తినిచ్చిన ప్ర‌భుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది.

Related posts