telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

మాతృభాష

అమృతమే
ఒంటి కాలిపై తపస్సు చేసుకుంటున్న
మౌనమునిలా
భావదారిద్ర్యంతో మనిషి
ఎమోజీ లతో డమ్మీ అవుతున్నాడు
మాతృభాషను సమాధి చేసి
అరువు భాషనే పుష్పాలతో అలంకరిస్తున్నాడు అలరారుతున్నాడు
అమ్మభాషను అమ్ముకుంటూ
అరువు భాషను నమ్ముకుంటూ
తన ఆత్మనే వమ్ము చేసుకుంటూ
అస్థిత్వానికి కొత్త ముసుగే
సరికొత్తగా తొడుగుతున్నాడు
వయసు ఉడిగి సత్తువ తరిగి
ఆదరించే తన వాళ్ళు లేక
మృతి చెందుతోంది అనాథలా
మాట నేర్పిన మన మాతృభాష
నిలువ నీడనే లేక నిన్ను మలిచిన అమ్మ
నీ కళ్ళముందే అదృశ్యమవుతోంది
తల్లి పాదాలనొక్కసారి తాకి చూడు
అంతా కవికోకిలల కూజిత శబ్ద రస ధ్వనులే
కాస్త ప్రేమగా పలకరించి చూడు
ఒడలంతా వీణాతంత్రుల పులకరమే
దరికి కాస్త వచ్చి చూడు
కమ్మదనమే అంతా అమ్మతనమే
తెనుగు మాటను కాస్త పలికి చూడు
తేనె ధారల ప్రవాహమే
ఆస్తులను పోగుచేసి కట్టబెట్టేవు సంతతికి
అమ్మనే ఇచ్చిచూడు
ఈ మాతృకొమ్మనే నిలబెట్టి చూడు
తరతరాలకు తరగని సంపదై
తెలుగు వనాలనే ప్రభవించును
ఆ సుగంధాలే అంతటా వెదజల్లును
మాతా శిశువుల్లా
సేదతీరుదురిరువురూ
ఒకరి ఒడిలో ఒకరు నిశ్చింతగా
భావితరమా ఇకనైనా మేలుకో
బాధ్యతను భుజాలపై వేసుకో

Related posts