telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నాన్న మనసు “వెన్న”లా…

నన్ను “పాలు” అనుకోండి
అందులో మీపై నాకున్న ప్రేమను
“తోడు”లా జోడుచేసుకొన్నాను
ఆ కలయిక మనకు గొప్ప అనుబంధమై
మీ చుట్టూ “పెరుగు”లా పేరుకుపోయాను
అందులో మీ సంతోషాన్ని జలంలా కలిపి
మీ చిరునవ్వుల చిలకరింపుతో నాపై చిలికితే
ఆ నవ్వుల తాకిడికి
నేను “చల్ల”లా మారిపోతూ
ఆ ఆనందంలో
నామనసు “వెన్న”లా తేలిపోతుంది…
మీకు కష్టపు వేడి తగిలిందని నాకు తెలిసినప్పుడు
ఆ గాయాలపై పూతలా చేరి
చల్లదనం అందిస్తూ
మీ నోటికి రుచినై మిమ్మల్ని తృప్తి పరచాలని
ఎంతటి కాకనైనా స్వీకరించి
“నెయ్యి”లా కరిగి కమ్మదనం గుమ్మరిస్తాను…
నేను పైకి తెల్లముఖం వేసుకొని
మీకు ఏమీ తెలియనివ్వను గానీ
నాలో మంచితనం లేదని
మీరు ఎంచుతూ ఉంటారు గానీ
మీలోచేరి మీకు మేలు చేయాలని
నాలో ఎన్నెన్నో దాచాను…
ఏవిధంగా నన్ను వాడుకొన్నా
నాలోని సర్వం తోడుకొన్నా
మీకు పనికొచ్చానని నాకు తెలిసినప్పుడు
పరమాన్నంలో కలిసినట్టు పరవశించిపోతాను…
నాకింత ముద్దయిన మీరు
నన్ను వద్దనుకొంటే
ఇక నేను “విరిగి”
ఈ మట్టిలో వరిగిపోవలసినదే…
నేనెవరో ఇంకా మీకు తెలియలేదా…!
నన్ను స్వీకరించి చూడండి
మీ కంటికి చూపునై
నా రుపాన్ని మీకు చూపిస్తానూ…
నేనే బిడ్డలారా…
“పాలు”లా మీకు మేలుచేయాలనుకొనే
మీ “నాన్న”ను…

Related posts