telugu navyamedia
సినిమా వార్తలు

టాలీవుడ్, నిర్మాత‌లు మారాల్సిన టైమ్ వ‌చ్చేసింది..

టాలీవుడ్‌లో సినిమా షూటింగ్స్‌ బంద్‌పై అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రొడక్షన్‌ వ్యయం తగ్గించే విషయమై నిర్మాతలు అందరూ కూర్చొని చర్చించామని ఆయన తెలిపారు.

విడుదలైన వెంటనే ఓటీటీల్లో రావడం వల్ల థియేటర్లకి వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతోంది. వాళ్లలో ఖర్చు చేసే సామర్థ్యమూ తగ్గడం అందుకు ఓ కారణమ‌ని అన్నారు. నెల రోజుల్లో పరిశ్రమని మళ్లీ కొత్తగా చూస్తారన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు.

కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో పరిస్థితులు మారిపోయాయి. ప్రేక్షకుల ఆలోచనల్లోనూ చాలా మార్పులొచ్చాయి. ఇంట్లో కూర్చుని భిన్నమైన కంటెంట్‌ని ఆస్వాదించారు. సినిమాల పరంగా ఎంతో అవగాహన పెంచుకున్నారు. ఇప్పుడు వాళ్లకి అంతంతమాత్రం కథలు నచ్చడం లేదు. ఇలాంటి సినిమాల కోసం ఇంత డబ్బు పెట్టి వెళ్లాలా అనుకుంటున్నారు. ఈ విషయాన్ని మేం అర్థం చేసుకుని, తదనుగుణంగా మారాల్సిన సమయం ఇది అని తెలిపారు.

ఈ మధ్య నిర్మాతలంతా కలిసి ఆ విషయమే మాట్లాడుకున్నాం. కథలు, మేకింగ్‌ శైలితోపాటు, నాన్‌ థియేట్రికల్‌, థియేట్రికల్‌ లెక్కలు మారిపోయాయి. వాటి గురించి ఇంకా బాగా అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సినిమాకీ డబ్బు పోతుందని తెలిస్తే బాధ ఉంటుంది. నిర్మాతలకే కాకుండా.. ఇప్పుడు దర్శకులకి, హీరోలకీ కూడా ఆ విషయం అర్థమైంది.

ఓటీటీలతో నిర్మాతలకి లాభం కంటే నష్టమే ఎక్కువ. ఓటీటీలో సూపర్‌హిట్‌ అయినా మాకు వచ్చేదేమీ ఉండదు. అదే థియేటర్లలో విడుదలైతే, ఎప్పటికప్పుడు వసూళ్లు పెరుగుతుంటే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. నిర్మాతల గురించి హీరోలూ ఆలోచిస్తున్నారు. అందరూ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. సమస్యల్ని అందరికీ అర్థమయ్యేలా చెబితే సరిపోతుందనేది నా అభిప్రాయం. స్టార్‌ హీరోల సినిమాలు థియేటర్ల తర్వాతే ఓటీటీకి వెళ్లాలి. అది కూడా పది లేదా ఇంకెన్ని వారాలో.. అనే విషయం గురించి చర్చిస్తున్నాం. పరిస్థితులన్నీ త్వరలోనే గాడిన పడతాయని నమ్ముతున్నాన‌ని అన్నారు.

Related posts