telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఆ సంస్థ టీడీపీ వ్యూహకర్తది ..అందుకే ఇలాంటి సర్వే: పేర్ని నాని

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఆ సర్వే సంస్థ తెలుగుదేశం పార్టీకి చెందినదని ఆయన ఆరోపించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రాఫ్‌ తగ్గిందనడం విచిత్రంగా ఉంది.

ఈ సర్వే చేపట్టిన సంస్థ పేరు సెంటర్ ఫర్ నేషనల్ స్టడీస్ అని తెలిపారు. ఇది తెలుగుదేశం పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తోన్న రాబిన్ శర్మదని నాని వెల్లడించారు. టీడీపీని కాపాడుకోవడానికి చేయించిన సర్వే ఇది. అందుకే వాళ్లు ఇలా రిపోర్టు ఇచ్చారు. 

 చంద్రబాబుకు సలహాలు ఇస్తున్న సంస్థ జగన్ కు వ్యతిరేకంగా సర్వేను ఇవ్వక ఏం చేస్తుందని పేర్ని నాని దుయ్యబట్టారు.

పవన్‌ కల్యాణ్‌ ద్వారా  గ్రాఫ్‌ పెంచుకోవాలని టీడీపీ ప్రయత్నించిందని, కానీ అలా జరగలేదు. తండ్రీకొడుకుల వల్ల గ్రాఫ్‌ లేవడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తర్వాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయింద‌ని పేర్ని నాని అన్నారు

దీంతో ఇలాంటి సర్వేలను తన జీతగాళ్లతో చేయించుకుని ఆనందపడిపోతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరు. వైఎస్‌ జగన్‌ అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఇలాంటి భోగస్ సర్వేలు సీఎం జగన్‌ను ఏం చేయలేవని.. ప్రజల్లో వున్న ఆయన గ్రాఫ్ ను ఎవ్వరూ తగ్గించలేరని పేర్ని నాని స్పష్టం చేశారు.

 

Related posts