telugu navyamedia
క్రీడలు

టోక్యో: పారాలింపిక్స్‌లో ‘పసిడి’ పోరులో భవీనా

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం ఖాయమైంది. టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత మహిళా(టీటీ) ప్లేయర్‌ భవీనాబెన్‌ పటేల్‌ ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణిపై ఆమె తిరుగులేని విజయం సాధించింది. జాంగ్‌ మియావోను 3-2 తేడాతో ఓడించింది. దేశానికి కనీసం రజతం ఖాయం చేసింది. పోలియో జయించి పతకానికి ఓ అడుగు దూరంలో నిలిచిన భవీనాబెన్‌ ప్రయాణం పలువురికి ఆదర్శం.

సెమీస్‌లో భవీనాబెన్‌ ఆట అద్భుతమనే చెప్పాలి. గతంలో ఆమెపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన జాంగ్‌ను 7-11, 11-7, 11-4, 9-11, 11-8 తేడాతో ఓడించింది. దాదాపుగా 34 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో తన సత్తా ఏంటో చూపించింది. తొలి గేములో భవీనాకు ఎదురుదెబ్బ తగిలింది. అయిన ఆమె వెంటనే పుంజుకుంది. వరుసగా రెండు గేములు కైవసం చేసుకొని 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో గేమ్‌ను ఆమె కేవలం 4 నిమిషాల్లో గెలుచుకోవడం ప్రత్యేకం.

కీలకమైన నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి జంగ్‌ తన సూపర్‌ క్లాస్‌ ఆటతీరును ప్రదర్శించింది. ఫలితంగా 2-2తో సమమైన మ్యాచ్‌ నిర్ణయాత్మక ఐదో గేమ్‌కు దారితీసింది. పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన భవీనా చివరి గేమ్‌లో వరుసగా పాయింట్లు సాధిస్తూ 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జాంగ్‌ సైతం వేగంగానే స్పందించి స్కోరును 5-9కి అట్నుంచి 8-9కి తగ్గించింది. ఈ క్రమంలో టైమ్‌ఔట్‌ తీసుకున్న భవీనా ఆట మొదలవ్వగానే వరుసగా రెండు పాయింట్లు సాధించి ఫైనల్‌కు చేరుకుంది. స్వర్ణ పతక పోరులో భవీనా ప్రపంచ నంబర్‌వన్‌ ఝౌతో తలపడనుంది.

‘నేనిక్కడికి వచ్చినప్పుడు మరేం ఆలోచించకుండా 100% శ్రమించాలని అనుకున్నా. ఎందుకంటే వందశాతం కష్టపడితే పతకం కచ్చితంగా వస్తుంది. నా దేశ ప్రజల ఆశీర్వాదాలు, ఇదే ఆత్మవిశ్వాసంతో కొనసాగితే ఆదివారం కచ్చితంగా స్వర్ణం గెలవగలను. నేను పసిడి పోరుకు సిద్ధంగా ఉన్నాను’ అని భవీనా సెమీస్‌ తర్వాత మీడియాకు చెప్పింది.

Related posts