telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ జీతాన్ని విరాళంగా ఇచ్చేసిన పంజాబ్ ఆటగాడు…

భారత్ లో కొద్దిరోజులుగా వరుసగా మూడున్నర లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయంటే.. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా మరణాలు సైతం బెంబేలెత్తిస్తున్నాయి. ఒకేసారి ఇన్ని లక్షలమందికి వైద్యాన్ని అందించడానికి అవసరమైనన్ని మౌలిక సదుపాయాలు భారత్‌లో లేవనేది స్పష్టమౌతోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్ అందక పదుల సంఖ్యలో కరోనా పేషెంట్లు తమ తుదిశ్వాసను విడుస్తున్నారు. కరోనా వల్ల కన్నుమూసిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేయడానిక్కూడా చోటు దొరకని దుస్థితి నెలకొంది. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఇవే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని చూసి చలించిన పలు దేశాలు భారత్‌కు సహాయాన్ని అందించడానికి ముందుకొస్తున్నాయి. అలాగే ఐపీఎల్ ఆడటానికి భారత్‌కు వచ్చిన కొందరు విదేశీ క్రికెటర్లు సైతం.. ఈ పరిస్థితులను చూసి చలించిపోతున్నారు. తాజాగా- ఇదే జాబితాలో వెస్టిండీస్ క్రికెటర్ నికొలస్ పూరన్ చేరాడు. కరోనా వైరస్ వల్ల భారత్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు తనను తీవ్రంగా కలచి వేస్తున్నాయని చెప్పాడు. దీన్ని అధిగమించడానికి తనవంతు సహాయాన్ని అందిస్తున్నాని తెలిపాడు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. కరోనా సంక్షోభ పరిస్థితుల నుంచి భారత్ శరవేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పాడు. దీనికోసం తన ఐపీఎల్ శాలరీ మొత్తాన్నీ విరాళంగా ప్రకటిస్తున్నట్లు నికొలస్ పూరన్ తెలిపాడు.

Related posts