telugu navyamedia
క్రైమ్ వార్తలు

భారత ఆర్మీపై దాడికి​ పాక్​ ఉగ్ర కుట్ర : ప‌ట్టుబ‌డ్డ టెర్రరిస్ట్‌

జమ్ముకశ్మీర్‌ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి చిక్కిన పాకిస్థాన్​ ఉగ్రవాది తబరక్‌ హుస్సేన్‌ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి.

వివ‌రాల్లోకి వెళితే..

జమ్ము కశ్మీర్‌ రాజౌరి వద్ద గత రెండురోజులుగా భారత్‌లోకి చొరబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీవోకే సమీపంలోని అటవీ ప్రాంతంలో భారత సైన్యం అమర్చిన ల్యాండ్‌ మైన్‌ పేలి ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా.. ఆగస్టు 21న నౌషేరా ప్రాంతంలోని ఝంగర్ సెక్టార్‌ నుంచి భారత్‌లోకి ఆయుధాలతో అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఓ ఉగ్రవాదిని గాయపరిచి అదుపులోకి తీసుకుంది భారత సైన్యం.

సరిహద్దు ప్రాంతంలోని ఫెన్సింగ్‌ను కట్‌ చేసి చొరబడేందుకు ప్రయత్నించారు. గమనించిన భారత సైనికులు కాల్పులు జరిపి.. అతన్ని గాయపరిచి పట్టుకున్నారు. మరో ఇద్దరు ముష్కరులు మాత్రం తప్పించుకున్నారు. గాయపడిన ఉగ్రవాదికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడడమే కాకుండా.. అతని నుంచి కీలక సమాచారం సేకరించింది భారత సైన్యం.

అతన్ని పీవోకే కొట్లి జిల్లా సబ్జ్‌కోట్‌కు చెందిన తబరాక్‌ హుస్సేన్‌గా గుర్తించారు.. భారత ఆర్మీ పోస్టుపై దాడి చేసేందుకు పాకిస్థాన్​ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీకి చెందిన కల్నల్‌ రూ. 30 వేలు ఇచ్చినట్లు.. ఉగ్రవాది తెలిపాడు. పాక్‌ కల్నల్‌ యునస్ చౌద్రీ తనకు డబ్బు ఇచ్చి ఆత్మాహుతి దాడి చేసేందుకు పంపాడని ముష్కరుడు చెప్పాడు. ఆయుధాలతో పాటు పాక్‌ కరెన్సీని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది.

పాకిస్థాన్ ఇంటిలిజెన్స్‌లో హుస్సేన్ దాదాపు రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. లష్కరే తోయిబా అతడికి ఆరు వారాల పాటు శిక్షణనిచ్చింది.   

పాక్​ సైన్యానికి చెందిన మేజర్‌ రజాక్‌ వద్ద హుస్సేన్‌ దాదాపు రెండు సంవత్సరాలుగా శిక్షణ పొందినట్లు సైన్యాధికారులు తెలిపారు. ఆరు నెలల శిక్షణలో భాగంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్​ కోసం పాక్‌ సైన్యం నిర్వహిస్తున్న ఉగ్ర శిబిరాలను హుస్సేన్‌ సందర్శించినట్లు వివరించారు.

Pak Colonel Gave Supari To Pak Terrorist To Attack Indian Army - Sakshi

కాగా హుస్సేన్‌ భారత్‌లోకి చొరబడుతూ పట్టుబడటం ఆరేళ్లలో ఇది రెండోసారని సైన్యాధికారులు తెలిపారు…హుస్సేన్‌తో పాటు అతడి సోదరుడు 15 ఏళ్ల హరూన్ అలి కూడా 2016 ఏప్రిల్‌లో అదే సెక్టార్‌లోకి చొచ్చుకుని రావటానికి ప్రయత్నించారని ఆర్మీ వెల్లడించింది. ఆ సమయంలో ఇద్దరూ పట్టుబడ్డారని, కానీ..మానవతా దృక్పథంతో 2017 నవంబర్‌లో వాళ్ల దేశానికి పంపామని తెలిపింది.అయినప్పటికీ తీరు మార్చుకోకుండా ఈసారి ఏకంగా దాడులకే సిద్ధపడడం గమనార్హం.

Related posts