మన దేశంలో ఐసిస్ కార్యకలాపాలపై 2014 డిసెంబరు 16 న ప్రభుత్వం నిషేధం విధించింది, దీన్నే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అనీ, క్లుప్తంగా ఐఎస్ఐఎస్ అనీ పిలుస్తారు. అరబిక్ భాషలో దీన్ని దాయెష్ గా పేర్కొంటారు. ఐసిస్ సంస్థ ఇరాక్, సిరియాల్లో చురుకుగా పని చేస్తున్న సున్నీ తెగకు చెందిన జిహాదీ సంస్థ. ఇరాక్, సిరియాలలో సున్నీలు నివసిస్తున్న ప్రాంతాలతో పాటు లెబనాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, సైప్రస్, దక్షిణ టర్కీలకు చెందిన భూ భాగంలో ఇస్లామిక్ సల్తనత్ పేరిట స్వత్రంత్ర రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో ఆ సంస్థ పని చేస్తోంది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ అధినేత అబూ బకర్ అల్ బగ్దాదీ అమెరికా జరిపిన ఆపరేషన్ లో ఆత్మహత్య చేసుకొని తన బంకర్లో మరణించాడు. దీంతో అక్కడ తన ప్రాభవం కోల్పోయిన నేపథ్యంలో ఐసిస్ – పిల్లి తన పిల్లలను తరచుగా మకాం మార్చినట్లు – ఆఫ్ఘనిస్థాన్ కు మకాం మార్చే పనిలో ఉందని ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి జావేద్ జారిఫ్ హెచ్చరించారు.
దీని వల్ల భారత్, పాక్, రష్యాల భద్రతకు ప్రమాదం ఏర్పడు తుందని తెలిపారు. సిరియా కేంద్రంగా కలిగిన ఐసిస్ తన కార్యకలాపాలను ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ దేశాలకు మార్చేందుకు సిద్ధం అవుతోంది. ఇది ఇరాన్, భారత్, పాకిస్థాన్‌లకు ఆందోళన కలిగించే అంశం. ఇది ఆ ప్రాంతం మొత్తాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఈ విషయంలో భారత్ తో కలసి పనిచేస్తున్నాం. పాక్-చైనా-రష్యాలతో కూడా ఈ విషయమై చర్చిస్తున్నాం. ఉగ్రవాదంపై జరుగుతున్న ఈ పోరు మనందరినీ ఒక్కతాటిపైకి తేచ్చేందుకు ఉపకరిస్తుందని తెలిపారు. అమెరికా సహాయం ఈ విషయంలో తక్కువగా ఉంటుందనే అభిప్రాయాన్ని జావేద్ జారిఫ్ వ్యక్తం చేశారు. మనకి సహాయం చేసేందుకు అమెరికా ముందుకి రాకపోవచ్చు నని, ఇప్పుడు మనకి మనమే ఒకరికి ఒకరుగా ఐఖ్యతతో సహాయం చేసుకోవాలని జావేద్ జారిఫ్ వ్యాఖ్యానించారు.