*చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్
*కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన
*టీడీపీ, వైసీపీ పోటా పోటీ నిరసనలకు పిలుపు
*అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
చిత్తూరు జిల్లాలోని కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. నిన్న చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో రామకుప్పం మండలం కొల్లుపల్లిలో నిన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
రెండు పార్టీల శ్రేణులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.ఈ రాళ్లదాడిలో రెండుపార్టీల క్యాడర్ తో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మరోవైపు చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది .అయితే రెండో రోజు చంద్రబాబు టూర్ ను అడ్డుకొంటామని వైసీపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. టీడీపీ నేతలు కూడా వైసీపీ శ్రేణుల తీరును నిరసిస్తూ నిరసనకు దిగుతామని ప్రకటించాయి. రెండు పార్టీలు కూడా నియోజకవర్గంలో పోటా పోటీ నిరసనలకు పిలుపునిచ్చాయి
భారీ నిరసన ప్రదర్శనకు తరలి రావాలంటూ వైసిపి క్యాడర్ కు పిలుపు నిచ్చారు. ఎమ్మెల్సీ భరత్ ఇంటి నుంచి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వైయస్సార్ విగ్రహం వరకు వైసిపి నిరసన ప్రదర్శన చేయనున్నామని ఎమ్మెల్సీ భరత్ ఇప్పటికే ప్రకటించారు.,
టిడిపి శ్రేణులు గురువారం ఉదయం 8 గంటలకు కుప్పం చేరుకోవాలని చిత్తూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షుడు పులివర్తి నాని పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలో ఇరుపార్టీల శ్రేణులు భారీగా కుప్పంకు చేరుకుంటున్నారు.
దీంతో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకన్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు
అంతేకాదు విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఎప్పటికప్పుడు కుప్పంలో పరిస్థితిని పోలీసు అధికారులతో సమీక్షిస్తున్నారు ఎస్పీ రిశాంత్ రెడ్డి. అంతేకాదు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఇతర జిల్లాల పోలీసు బలగాలు కుప్పానికి చేరుకుంటున్నాయి.