telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు తెలుగు కవిత్వం వార్తలు సామాజిక సినిమా వార్తలు

తెలుగు పత్రికా రంగంలో చెరగని ముద్రవేసిన పద్మవిభూషణ్ రామోజీ రావు గారు ఇక లేరు – భగీరథ

రామోజీ రావు గారు ప్రాతః కాల స్మరణీయులు

తెలుగు పత్రికా రంగంలో చెరగని ముద్రవేసిన పద్మవిభూషణ్ రామోజీ రావు గారు ఇక లేరు అన్న విషాద వార్త నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది.


పత్రికా రంగం , సినిమా రంగం , వ్యాపార రంగాల్లో ఆయన సాధించిన ప్రగతి అపూర్వం , అనితర సాధ్యం .
రామోజీ రావు గారితో నాకు 1983 నుంచి పరిచయం .

ఎన్ .టి .రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటిసారి రామోజీ రావు గారిని జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక (ఆంధ్ర జ్యోతి సంస్థ ) రిపోర్టర్ గా ఇంటర్వ్యూ చేశాను. ఈనాడు కార్యాలయంలో రెండవ ఫ్లోర్ లో ఉండేవారు . అప్పుడు వారు నా పట్ల చూపించిన అభిమానం, ఆత్మీయత ఎప్పటికీ మర్చిపోలేను. రామోజీరావు గారితో నేను చేసిన ఆ ఇంటర్వ్యూ సంచలనం సృష్టించింది . ఆ తరువాత అనేక సందర్భాల్లో వారిని కలవడం జరిగింది. నా పట్ల ప్రత్యేకమైన అభిమానం చూపించేవారు .

1987 ఫిబ్రవరి 8న నా వివాహ రిసెప్షన్ కు వారిని ఆహ్వానించాను. నేను ఆంధ్ర జ్యోతి లో పనిచేసేవాడిని . ఈనాడులో పనిచేయలేదు కాబట్టి వారు హాజరు కారు అనుకున్నాను. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన రిసెప్షన్ కు రామోజీ రావు గారు మయూరి జనరల్ మేనేజర్ త్రిపురనేని కేశవ రావు గారు , ఉషాకిరణ్ మూవీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అట్లూరి రామారావు గారితో వచ్చి గంటసేపు వున్నారు .

మా దంపతులను రామోజీ రావు గారు ఆశీర్వదించడం మా అమ్మా, నాన్న , మా అత్త , మామలు ఎంత సంతోషించారో మాటల్లో చెప్పలేను.

మా పెద్ద పాప శైలి పుట్టినప్పుడు ఆ వార్త ను వారికి ఫోన్లో చెప్పాను . వారు పాపను ఆశీర్వదిస్తూ ఒక లేఖ పంపించారు . అది కూడా మధురానుభవం .


నేను ఆంధ్ర ప్రభలో పనిచేసేటప్పుడు 1999లో సినిమా రంగంపై మోహిని అనే ప్రత్యేక సంచికలు వెలువరించాము . ఆ సందర్భంగా వారు రామోజీ ఫిలిం సిటీని ఎందుకు ప్రారంభించింది , ఆ ఫిలిం సిటీకి తన పేరు ఎందుకు పెట్టుకున్నారో వివరించారు.

వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ గా పదవీ భాద్యతలు స్వీకరించిన తరువాత మొదటిసారి హైదరాబాద్ వచ్చారు . అప్పుడు వెంకయ్య నాయుడు గారు , స్పీకర్ మధుసూనాచారి గారి తో పాటు రామోజీ రావు గారిని కలిశాను. ఆ సందర్భంగా వారు ఆప్యాయంగా మాట్లాడారు .

గత సంవత్సరం నేను సంపాదకత్వం వహించిన “శకపురుషుడు ” (ఎన్ .టి .ఆర్. శతాబ్ది సందర్భంగా వెలువడిన గ్రంథం ) పుస్తకాన్ని వారికి బహుకరిద్దామని ప్రయత్నించాను . అయితే వారి ఆరోగ్యం బాగా లేకపోవడంతో కలవలేకపొయ్యాను.

1936 నవంబర్ 16న ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణ జిల్లాలోని పెదపారుపూడి గ్రామంలో వెంకటసుబ్బమ్మ, వెంకట సుబ్బారావు దంపతులకు జన్మించారు .

1962లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ను ప్రారంభించారు .

1974లో విశాఖపట్నంలో ఈనాడు దిన పత్రికను ప్రారంభించారు .

ఆ తరువాత న్యూస్ టైమ్ అనే ఇంగ్లీష్ దిన పత్రికను మొదలు పెట్టారు .

సితార, అన్నదాత, చతుర, విపుల, అన్నదాత, తెలుగు వెలుగు, బాలభారతం పత్రికలు విజయవంతంగా నడిపారు .

ఈ టీవి, ఈటివి 2, ఈ టివి కన్నడ, మరాఠి, ఉర్దు, బెంగాలి, ఒరియా, గుజరాతీ, బీహార్ వంటి ఛానల్స్
రామోజీ ఫిల్మ్ సిటీ

ఉషా కిరణ్ మూవీస్ నిర్మాణ సంస్థ ,
కళాంజలి –
బ్రిసా ,
ప్రియా ఫుడ్స్ ,
డాల్ఫిన్ హోటల్,
క లోరమ ప్రింటర్స్
ప్రియా పచ్చళ్లు ఆయన ప్రారంభించారు .
ఇక సినిమా రంగంలో ప్రవేశించి ,
శ్రీవారికి ప్రేమలేఖ (1984)
మయూరి (1985)
మౌన పోరాటం (1989)
ప్రతిఘటన (1987)
పీపుల్స్ ఎన్‌కౌంటర్ (1991)
అశ్వని (1991)
చిత్రం (2000)
మెకానిక్ మామయ్య
ఇష్టం (2001)
నువ్వే కావాలి (2000)
ఆనందం (2001)
ఆకాశ వీధిలో (2001)
మూడుముక్కలాట
నిన్ను చూడాలని (2001)
తుఝె మేరీ కసమ్
వీధి (2005)
నచ్చావులే (2008)
నిన్ను కలిసాక (2009)
సవారి (కన్నద గమ్యమ్) (2009)చిత్రాలను నిర్మించారు .

1996లో రామోజీ రావు నిర్మించిన ఫిలిం సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచింది . 2000 ఎకరాల్లో నిర్మించిన ఈ ఫిలిం సిటీకి ఆయన తన పేరు పెట్టుకున్నారు .

2016లో భారత ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి పద్మవిభూషణ్ అవార్డును బహుకరించింది .
గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంగా వున్నారు . శుక్రవారం రోజు రామోజీ రావు గారు శ్వాస సంబంధమైన సమస్యతో ఆసుపత్రిలో చేరారు . శనివారం ఉదయం 4. 50 నిముషాలకు తుది శ్వాస విడిచారు .
రామోజీ రావు గారు తెలుగు ప్రజలకు ఎప్పుడూ ప్రాతః కాల స్మరణీయులే.

– భగీరథ

Related posts