telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు: రాజ్ నాథ్

Rajnath singh Bjp

చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. భారత్-చైనా సరిహద్దు సమస్యపై లోక్ సభలో ఆయన ప్రసంగించారు. 1962లో లడఖ్ లో చైనా 90 వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని తెలిపారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడంలేదని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకునేందుకు చైనాతో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నామని వివరించారు.

సరిహద్దుల విషయంలో సామరస్య పూర్వక పరిష్కారం కోరుకుంటున్నామని చెప్పారు. అందుకు చర్చలే సరైన ప్రాతిపదిక అని భావిస్తున్నామని రాజ్ నాథ్ తమ వైఖరి స్పష్టం చేశారు. చైనా దూకుడు చర్యలతో శాంతి ఒప్పందంపై తీవ్ర ప్రభావం పడిందని వెల్లడించారు. సరిహద్దు సమస్య తేలేవరకు ఎల్ఏసీని గౌరవించాలన్న నిర్ణయాన్ని చైనా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.

సరిహద్దులను మార్చాలన్న చైనా కుయుక్తులను మన సైన్యం తిప్పికొట్టిందని పేర్కొన్నారు. ఎంతో సంక్లిష్టమైన పరిస్థితుల్లో మన సైన్యం చైనా ఆక్రమణలను నిలువరించిందని రాజ్ నాథ్ సింగ్ వివరించారు. దౌత్య మార్గాల ద్వారా సమస్య పరిష్కారం కావాలన్నది తమ అభిమతమని అభిప్రాయపడ్డారు.

ఆగస్టులో భారత్ ను రెచ్చగొట్టేందుకు చైనా ప్రయత్నించిందని, సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలకు పాల్పడిందని వెల్లడించారు. ఆగస్టు 29, 30 రాత్రి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టిందని చెప్పారు. మన సైన్యం అందుకు దీటుగా బదులిచ్చిందని తెలిపారు. 1993, 96 ఒప్పందాలను చైనా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. చైనా వైఖరి గమనించి సరిహద్దుల్లో బలగాలను మరింత పెంచామని రాజ్ నాథ్ స్పష్టం చేశారు.

Related posts