telugu navyamedia
తెలంగాణ వార్తలు

యాసంగిల్లో ప్రత్యామ్నాయంగా ఆయిల్ పామ్ సాగు..

తెలంగాణలో యాసంగి పంటలో వరి సాగుచేయవద్దని ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. దీంతో విపక్షాలు, రైతులు ప్రభుత్వ మాటలను పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. యాసంగి సాగుపట్ల రైతులకు మార్గదర్శకంగా ఉండేందుకు పౌరసరఫరాలమంత్రి గంగుల కమలాకర్ రోల్ మోడల్ కావాలనే ప్రయత్నం చేశారు. కరీంనగర్ సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇంతకాలం వరి పండించిన పొలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు సిద్దమయ్యారు. పొలాన్ని చదునుచేసి ఆయిల్ ఫామ్ సాగుకు అనువుగా భూమిని సిద్ధం చేసారు. వ్యవసాయ అధికారుల సలహాల, సూచనలతో పొలంలో గుంతలు తీసి మొక్కలు నాటడానికి అనువుగా తీర్చిదిద్దిన పనులను స్వయంగా మంత్రి పర్యవేక్షించారు.

ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ నేలలు అనువైనవని నిర్దారణ కావడంతో ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.కరీంనగర్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ప్రభుత్వం లోహియా కంపెనీని నియమించింది, సబ్సిడీపై రైతులకు మొక్కలు అందించడం మొదలు కోత అనంతరం గెలలు తీసుకునే దాకా ఆ కంపెనీ పూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తుంది. కోతుల బెడద లేకుండా, చీడపీడల బెడద తక్కువతో సాగయ్యే ఆయిల్ ఫామ్ చెట్లను తొమ్మిది మీటర్లకు ఒక మొక్క చొప్పున ఎకరాకు దాదాపు 57 మొక్కల ద్వారా 10టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

టన్నుకు 10వేల రూపాయలమేర గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉందని, అన్ని ఖర్చులు పోనూ ఎకరాకు 70 నుండి 80వేల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతీ ఏడాది లక్షకోట్ల రూపాయల విలువైన ఆయిల్ని ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. సాగు మొదలుపెట్టిన నాలుగేళ్ల నుండి దాదాపు 40 సంవత్సరాల వరకూ దిగుబడి ఇచ్చే ఆయిల్ ఫామ్ మొదటి మూడేళ్లు ప్రభుత్వం ఏడాదికి 25వేల చొప్పున సబ్సిడీని అందిస్తుందని పౌరసరఫరాలమంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

Related posts