telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు సినిమా వార్తలు

తెరమీద ధీర గంభీరత్వం – తెర వెనుక హాస్య రస వీరత్వం వెరసి రాజబాబు

జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమిస్తూ , కన్నీళ్లను తుడిచివేస్తూ నలుగురితో నవ్వుతో, నవ్వులను పండిస్తూ ఆహ్లాదకరంగా ఎవరు తమ జీవనాన్ని మలచుకుంటారో వారే ధీరోదాత్తులు. సుఖ దుఃఖాలు లేని జీవితం ఉండదు . కానీ విజయం వచ్చినప్పుడు పొంగిపోయి , అపజయం కలిగినప్పుడు కుంగిపోయే మనుషులు ఎందరో కనిపిస్తారు , కానీ జయాపజయాలు , సుఖదుఃఖాలు అతీతంగా తన చుట్టూ వున్న మిత్రులను కన్నీరు ఉబికేలా నవ్వించే అరుదైన నటుడు , ఆత్మీయ వ్యక్తి రాజబాబు .
Raja Babu

రాజబాబు అనగానే ఒకప్పటి హాస్య నట చక్రవర్తి అనుకునేరు . ఈ రాజబాబు తెలుగు సినిమా , టీవీలో అను నిత్యం ప్రేక్షకులను సమ్మోహపరిచే క్యారెక్టర్ నటుడు రాజబాబు .
Raja Babu
రాజబాబు తెర మీద చాలా గంభీరంగా కనిపిస్తాడు , ఏ పాత్రయినా అందులో ఒదిగిపోయే తత్త్వం , ఆ పాత్రను పండించే మనస్తత్వం రాజబాబు ప్రత్యేకత . అవును రాజబాబు స్వతహాగా నటుడు , ఆయన మాట్లాడేటప్పుడు ముఖ కవళికలు , శరీర కదలికలు చాలా సహజంగా ఉంటాయి . అందుకే స్నేహితులు రాజబాబులో వున్న నటుణ్ని గుర్తించారు , ప్రోత్సహించాలనుకున్నారు . అలా రాజబాబు ప్రమేయం లేకుండానే రంగస్థలంపై కాలు మోపాడు . “పుటుక్కు జర జెర డుబుక్కు మే “, “పూజకు వేళాయరా “నాటకాలతో రాజబాబు నటుడుగా తన సత్తా చూపించాడు . ఒక ప్రత్యేకత సంపాదించుకున్నాడు .
Raja Babu
మనిషి తాను ఏమి కావాలనుకుంటాడో ఆదిశగా సాగిపోతాడు.ఆ గమనంలో తాను ఆశించింది సాధించి గమ్యం చేరవచ్చు లేదా పరాజయంతో అక్కడితో ఆప్రయాణం ఆగిపోవచ్చు . అయితే తన ప్రమేయం లేకుండా ఏ వ్యక్తి జీవితం సాగిపోతుందో దానికి ఓ గమ్యం , ఓ సార్ధకత ఉంటాయి . బహుశ దానినే అదృష్టం లేదా విధి లిఖితం అంటారు.
Raja Babu
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నరసాపుర పేట లో జన్మిచిన రాజబాబు జీవితానికి ఓ అర్ధం , పరమార్ధం వున్నాయి కాబట్టే ఆయనలోని గొప్ప నటుణ్ణి దర్శకుడు ఉప్పలపాటి నారాయణ రావు చూడగలిగారు . 1995లో శ్రీకాంత్ హీరోగా నిర్మించిన “ఊరికి మొనగాడు ” సినిమాలో సినిమా రంగానికి పరిచయం చేశారు . మొదట్లో స్నేహితులు రాజబాబు తమ ఊరికే మొనగాడు అనుకున్నారు . అయితే ఆ తరువాత కాలంలో రాజబాబు తెరపైన సిందూరం , ఆడవారి మాటలు అర్ధాలే వేరులే , మురారి ,శ్రీకారం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ,సముద్రం , కళ్యాణ వైభోగం ,మళ్ళీ రావా ?, భరత్ అనే నేను సినిమాల్లో పాత్రలు , టీవీ వసంత కోకిల, అభిషేకం , రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం , చి ల సౌ స్రవంతి ,ప్రియాంక సీరియల్స్ లోని లో పోషించిన పాత్రలను చూసిన తరువాత రాజబాబు ను సినిమారంగంలో మొనగాడు అని ఊరి ప్రజలు , మిత్రులు గౌరవిస్తున్నారు .
Raja Babu
సహజంగా గోదారొళ్ళ మాటల్లో కాస్త వెటకారం ఉంటుందని అంటారు అయితే రాజబాబు లో మమకారం చాలా ఎక్కువ . ఎప్పుడూ నవ్వుతో నవ్విస్తూ వుండే అపురూపమైన వ్యక్తి . మంచి మాటకారి మాత్రమే కాదు అంతకు మించి ఆత్మీయతను పెంచి అందరికీ పంచే మనసున్న మిత్రుడు రాజబాబు .

Raja Babu
ఒక్కసారి రాజబాబు తో పరిచయం అయితే జీవితాంతం మర్చిపోలేని స్నేహశీలి రాజబాబు .
ఈ ఇరవై ఐదేళ్ల లో 62 సినిమాలు, 48 సీరియళ్లు , ప్రభుత్వ నంది అవార్డు , ప్రైవేట్ సంస్థలు చేసిన సత్కారాలు ఎన్నో ఎన్నెనో రాజబాబు జీవితాల్లో మర్చిపోలేని మధుర స్మృతులు .. సాధించిన విజయాలు . నటుడుగా ఎప్పటికీ చెరిగిపోని చిరునామా !
ఇవ్వాళ రాజబాబు గారి 64వ పుట్టినరోజు . ఆయన్ని అమితంగా అభిమానించి, ఆత్మీయతను పంచె మిత్రులకు పండుగ రోజు .
రాజబాబు ఇక ముందు కూడా వెండి తెర , బుల్లి తెర మీద రాజబాబు లా వెలిగిపోవాలని అందరి ఆశ , ఆకాంక్ష .

భగీరథ
సీనియర్ జర్నలిస్టు

Related posts