telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పంచాయితీరాజ్ చట్టంపై .. కేసీఆర్ మొండి వైఖరి .. 60 రోజుల ప్రణాళిక …

KCR cm telangana

సీఎం కేసీఆర్‌ మరోసారి పంచాయతీరాజ్‌ చట్టం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌ శాఖపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌, మండలానికి ఒక్కొక్కరు చొప్పున పంచాయతీ రాజ్‌ అధికారుల్ని నియమించాలని ఆదేశించారు. ఎంపీడీవో, సీఈవో పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని.. అందుకు వీలుగా పదోన్నతులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనంపై సీఎం సమీక్షించారు. 60 రోజుల ప్రణాళిక ద్వారా స్వచ్ఛతను పెంపొందించనున్నట్టు కేసీఆర్‌ స్పష్టంచేశారు. వందకు వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిదేనన్నారు. విద్యుత్‌ సంస్థలకు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలన్నారు. గ్రామస్థులను శ్రమదానానికి ప్రోత్సహించి సామాజిక పనులు చేయాలన్నారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత కోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అన్ని గ్రామాల్లోనూ 60 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలుచేయాలని సూచించారు. 60 రోజుల కార్యాచరణలో భాగంగానే పవర్‌ వీక్‌, హరితహారం నిర్వహించాలన్నారు. 60 రోజుల తర్వాత ముఖ్య అధికారులు గ్రామాల్లో పర్యటిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలను ఏర్పాటు చేస్తామన్నారు. నిర్దేశించిన పనులను చేపట్టని ప్రజా ప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.

స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లయినా గ్రామాల పరిస్థితి ఇంకా మారలేదన్నారు. ఎన్నో వేల కోట్లు ఖర్చుచేసినా ఫలితం కనిపించడంలేదన్నారు. ఎవరికి వారు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. ప్రతి రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున డీఎల్‌పీవోలను నియమించాలని.. ప్రతి మండలానికి ఒక పంచాయతీ అధికారిని నియమించాలన్నారు. ఈవోపీఆర్డీ పేరును తీసేసి ఎంపీవోగా మార్చాలని సీఎం ఆదేశించారు.

Related posts