telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కుట్రలు-కుతంత్రాలు

ఆకాశం తన మబ్బుల
ఆకారాలను మార్చినట్లు
నువ్వు వక్రీకరించే చారిత్రక వాస్తవాలు
కాలగమనంలో-
పెను సవాళ్ళనే విసురుతూ
ఖచ్చితంగా మీకు ఎదురుతిరుగుతై
క్రీస్తుకు మునుపెన్నడో ఎప్పుడో
విలువలకు కట్టుబడిన వారిని పట్టుకు
బలిగొన్న శిలువల నెత్తుటి కాసారం
ఇప్పటికీ ఇదిగో ఇంకా
వాడి వేడి సెగలను కక్కుతూనే వుంది
బొమికలు నుజ్జు నుజ్జు చేసి
బూదికుప్పగా మిగిల్చినా
ఆ ఆగ్రహోదగ్ర అధికారమదాంధులపై
తిరగబడే ఆయుధాలను చెక్కుతూనే వుంది
మీ కుట్రలు కుతంత్రాలు
మీ జైళ్ళు దగాకోరు ఫైళ్ళు
మతదురహంకార వైరభావనలన్నీ
మీతో సహా
అతిసమీప భవిష్యత్తులో….
అలనాడు సజీవంగా తగులబడుతూ
కళ్ళలో ప్రతిఫలించిన అమాయక నిస్సహాయతల గగ్గోలలకు
లోలోపలే కసిగా రగులబడుతూ దహించుకుపోయినా ఆక్షణాలు
తీవ్రమైన ఎర్రెర్రనీ నిప్పుకణాలై
మిమ్ములను వెతుకుతూనే వున్నాయి
అవి మసిచేసే వరకు చల్లారవు
ఇది కాదన లేని వేదన చేదు సత్యం
ఇక పోరాటం తరాలకు అనునిత్యం

Related posts