telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

నివర్‌ తుఫాన్‌ : ఏపీలోని ఐదు జిల్లాలు అతలాకుతలం

ఆంధ్రప్రదేశ్ లో నివారు తుఫాన్ విధ్వంసం సృష్టిస్తోంది.. తుఫాన్‌ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలాయి. నేషనల్ హైవే పైకి వర్షపు నీరు రావడంతో నెల్లూరులో ట్రాఫిక్‌ జామ్ అయింది. తుపాను కారణంగా నెల్లూరు, చిత్తూరులో నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. తిరుమలలో  కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. హరిణి ప్రాంతంలో రహదారిపై బండ రాళ్లు పడ్డాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 30 సెంటీమీటర్ల వర్షం పడింది. కడప జిల్లా సీకే దిన్నే మండలంలోని బుగ్గవంక ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేశారు. జిల్లాలోని ఒంటిమిట్ట చెరువు 10 ఏళ్లు తర్వాత జలకళ సంతరించుకుంది. తిరుపతిలో  లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. ప్రాధాన రోడ్లన్ని జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక, నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రహదారులపై చెట్లు కూలి పడటంతో ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది వాటిని తొలగించారు. పంటకాలువలు, రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.  జిల్లాల్లోని 1600 చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. నివర్ తుఫాన్‌ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో నడిచే 7 రైళ్లు నిలిపివేసినట్లు తెలిపింది.

Related posts