telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

విశాఖలో భూములు కాజేసేందుకే వైసీపీ కుట్ర – చినరాజప్ప

Nimmakayala

అభివృద్ది వికేంద్రీకరణ అంటే ఆఫీసులు మార్చటం కాదు
స్దానిక సంస్ధలకు నిధులు, విధులు బదలాయించటం
సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న బిల్లులను గవర్నర్ కు ఏ విధంగా పంపుతారు? ఇది కోర్టు ధిక్కరణ కాదా?
విభజన చట్టం సవరించకుండా అమరావతి మార్పు పార్లమెంట్ ను ధిక్కరించడమే
కరోనా నివారణపై కాక అమరావతిపై ఈ సమయంలో ఎందుకు పాకులాడుతున్నారు?
విశాఖలో భూములు కాజేసేందుకే వైసీపీ కుట్ర

అన్ని ప్రాంతాల అభివృద్ది కోసమే జగన్ వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పటం విడ్డూరంగా ఉంది. ఆఫీసులు మార్చడం వికేంద్రీకరణ కాదు. వికేంద్రీకరణ అంటే స్థానిక సంస్థలకు నిధులు, విధులు బదలాయించాలి. కేంద్రం పంపిన స్థానిక సంస్థల నిధులను ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులను రంగులకు, ఇతర దుబారా ఖర్చులకు మళ్లించడంతో పాటు వికేంద్రీకరణ స్ఫూర్తికి పాతరేశారు. 50శాతం నామినేటెడ్ పోస్టులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయిస్తానని చెప్పి.. జగన్ రెడ్డి సొంత సామాజికవర్గానికే సలహాదారుల పదవులు కట్టబెట్టి అభివృద్ధి వికేంద్రీకరణను కాలరాశారు. వికేంద్రీకరణ ముసుగులో విశాఖలో భూకబ్జాల కోసం కుట్ర పన్నుతున్నారు. అది కూడా చట్ట విరుద్ధంగా చేస్తున్నారు. సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉన్న సీఆర్డీయే రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్ కు పంపడం హైకోర్టు ధిక్కరణ అవుతుంది. విభజన చట్టం సవరించకుండా అమరావతి మార్పు పార్లమెంట్ ను ధిక్కరించడమే. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభిప్రాయాలకు విరుద్ధంగా రాజధానిని మూడు ముక్కలు చేసేందుకు కుట్ర పన్నారు. ఇది ప్రజాభిప్రాయ ధిక్కరణ.. మూడు రాజధానుల అంశం సెలెక్ట్ కమిటీ పరిధిలో ఉండగా ఏవిధంగా గవర్నర్ కు పంపుతారు? విశాఖ ప్రజలు రాజకీయ రాజధాని కోరలేదు. ఆర్థిక రాజధాని చేయాలి. తన అవినీతి సంపదను పెంచుకునేందుకే జగన్మోహన్ రెడ్డి రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నారు. ధైర్యం ఉంటే మూడు రాజధానులపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అమరావతి తీర్మానాన్ని అసెంబ్లీలో బలపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాటమార్చారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులను మారుస్తారా? ఇది విభజన చట్టానికి వ్యతిరేకం.

మూడు ముక్కలాటతో కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే కుట్ర చేస్తున్నారు. అమరావతి ఏ ఒక్క కులానికో, మతానికో సంబంధించినది కాదు. ఇక్కడ ఎస్సీ, బీసీ, మైనార్టీలు 70 శాతం పైనే ఉన్నారు. 29 పంచాయతీల్లో కాపులు గణనీయంగా ఉన్నారు. తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు, తిరువూరు, నందిగామ, పామర్రు 6 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో, రాష్ట్రం నడిబొడ్డున, నదీ తీరాన రాజధాని ఉంది. సీఆర్డీయే రద్దు బిల్లు కోసమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. కరోనా నివారణపై కాకుండా అమరావతిపై ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు పాకులాడుతున్నారు? అమరావతిని నాశనం చేయాలనే జగన్మోహన్ రెడ్డి కుట్రలు ఫలించవు.

నిమ్మకాయల చినరాజప్ప
మాజీ మంత్రివర్యులు

Related posts