telugu navyamedia
క్రీడలు వార్తలు

చెన్నై సిరీస్ కు దూరం అవ్వడం బాధగా ఉంది…

ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లకు దూరం కావడం బాధగా ఉందని టీమిండియా యువ పేసర్ టీ నటరాజన్ అన్నాడు. కొన్ని నెలలపాట జట్టుతో ఉండి, ఇప్పుడు దూరంగా ఉండటం ఏదో కోల్పోయిన భావనను కలిగిస్తుందన్నాడు. ఇక తన బయోపిక్‌ను తెరకెక్కించేందుకు చాలా మంది దర్శకులు ముందుకు వచ్చారని, కానీ ప్రస్తుతం తన దృష్టాంతా టీమిండియాకు ఆడటంపైనే ఉందని ఈ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ తెలిపాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అనూహ్యంగా అవకాశాలందుకున్న ఈ తమిళనాడు క్రికెటర్ మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నెట్‌బౌలర్‌గా జట్టులో చేరి తనదైన ఆటతీరుతో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అయితే గత 6 నెలలుగా విరామం లేకుండా ఆడుతున్న నట్టూని టీమిండియా మేనేజ్‌మెంట్ ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్ నుంచి తప్పించి విశ్రాంతినిచ్చింది.

ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉన్న నట్టూ.. ఈ ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఆస్వాదిస్తున్నాడు. అయితే చెన్నై వేదికగా జరిగే మ్యాచ్‌లకు దూరమవ్వడం బాధగా ఉందని ఈ యార్కర్ల నట్టూ పేర్కొన్నాడు. ‘గత కొన్ని నెలలుగా జట్టుతోనే ఉండి ఇప్పుడు దూరంగా ఉండటం బాధగానే ఉంది. కానీ విశ్రాంతి తీసుకోవడం ఎంత ముఖ్యమో నేను అర్థం చేసుకోగలను. గత 6 నెలలుగా నేను మా కుటుంబానికి దూరంగా ఉన్నాను. దాంతో ఈ విశ్రాంతి పట్ల నేను సంతృప్తిగానే ఉన్నాను. కానీ చెన్నై వేదికగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు జట్టుతో లేననే బాధే నన్ను వెంటాడుతుంది.’అని నటరాజన్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ఇంగ్లండ్-భారత్ ఫస్ట్ టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రెండో టెస్ట్ కూడా ఇక్కడే జరగనుంది. ఇక మూడు ఫార్మాట్లలో ఆడటంపైనే తాను దృష్టిసారించానని నట్టూ తెలిపాడు. దానికి అనుగుణంగా కసరత్తులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ‘వర్క్‌లోడ్‌ను మెయింటేన్ చేస్తూ మూడు ఫార్మాట్లలో రాణించాలనుకుంటున్నా. అందుకనుగుణంగా నా ఫిట్‌నెస్, బౌలింగ్ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడంపై దృష్టిసారించా. నా జీవితంలో వరుసగా ఆరు నెలలు ఆడటం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌లో నా ట్రైనింగ్‌ను కొనసాగించడం వల్లనే నేను ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటన వర్క్‌లోడ్‌ను సమన్వయం చేసుకోగలిగాను.’అని తెలిపాడు.

Related posts