telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పీకేపై బహిష్కరణ వేటు…!

Nitish-Kumar

ప్రశాంత్ కిషోర్… ఇది ఓ పేరు మాత్రమే కాదు.. బ్రాండ్ కూడా… ఎన్నికల వ్యూహకర్తగా అంతలా పేరు సంపాదించారు పీకే.. నరేంద్ర మోడీ తొలిసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టిన ఘనత ఆయనకే దక్కగా.. బీహార్‌లో నితీష్‌ కుమార్‌ను గద్దెనెక్కించింది ఆయనే… ఇక ఏపీలో వైఎస్ జగన్‌ను… మరికొన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికల సమయంలో కీలక సూచనలతో వారి విజయాలకు కృషి చేశారు. అయితే, నితీష్ కుమార్.. ప్రశాంత్‌ కిషోర్‌ను పార్టీలోకి ఆహ్వానించిన కీలక పదవి కట్టబెట్టారు.. జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) జేడీయూ ఉపాధ్యక్షుడుగా సముచిత స్థానం కలిపించారు. అయితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌పై వేటు వేసింది పార్టీ.. ప్రశాంత్ కిషోర్, మరో నేత పవన్ వర్మను పార్టీ నుంచి బహిష్కరించింది జేడీయూ. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఇద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జేడీయూ ప్రకటించింది. అసలు నితీష్‌ కుమార్‌కు నమ్మకంగా ఉన్న వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే చర్చ సాగుతోంది. అయితే, దీనికి కారణం పౌరసత్వ సవరణ బిల్లు అనేది స్పష్టం. పౌరసత్వ సవరణ బిల్లును మొదటి నుంచీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు పీకే.. పార్లమెంటులో సీఏఏ చట్టానికి జేడీయూ మద్దతు ఇవ్వడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.

అంతేకాదు.. సీఏఏకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.. అదే సమయంలో సీఏఏ, ఎన్‌ఆర్సీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. ఈ పోరాటంలో చురుకుగా పాల్గొంటున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకి స్పెషల్ థాంక్స్ కూడా చెప్పారు. దీంతో వివాదం ముదురుతూ వస్తుండగా.. కేంద్ర మంత్రి అమిత్‌షా సూచనల మేరకే పీకేను పార్టీలోకి తీసుకున్నామని నితీష్ కుమార్ ట్వీట్ చేశారు.. అదే సందర్బంలో పీకే పార్టీలో ఉంటే ఉండొచ్చు.. పోతే పోవచ్చు అంటూ కొంత ఘాటుగా పేర్కనడంతో పరిస్థితి మరింత సీరియస్ అయ్యింది. దీనికి అంతే ఘాటుగా బదులిచ్చారు ప్రశాంత్ కిషోర్.. అమిత్‌షా ఎవరినైనా సిఫారసు చేస్తే తిరస్కరించే ధైర్యం మీకు లేదని చెప్పదలచుకున్నారా? అంటూ సోషల్ మీడియా వేదికగానే నిలదీశారు పీకే. ఈ వివాదం ఇంతటితో ఆగలేదు.. జేడీయూ నేత అజయ్ అలోక్.. ప్రశాంత్‌ కిషోర్‌ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈ వ్యక్తి అంత నమ్మదగినవాడు కాదు. మోడీజీ, నితీష్‌జీ విశ్వాసాన్ని ఆయన పొందలేకపోయారని వ్యాఖ్యానించిన ఆయన.. పీకే ఆప్ తరఫున పనిచేస్తారు, రాహుల్ గాంధీతో మాట్లాడతారు, మమతా దీదీతో కూర్చుంటారు. ఆయనను నమ్మేదెవరు? ఈ కరోనా వైరస్ మమ్మల్ని వదిలిపోతే సంతోషిస్తాం అంటూ ఘాటు వ్యాఖయలు చేశారు. ఇక, అనంతరం పీకేపై జేడీయూ.. పార్టీ నుంచి బహిష్కరించడం.. ఈ వ్యవహారంతో మాట్లాడేందుకు నిరాకరించిన పీకే… సోషల్ మీడియా వేదికగా నితీష్ కుమార్‌కు థాంక్స్ చెబుతూ.. “మీరు బీహార్ సీఎం కుర్చీని నిలుపుకోవాలని కోరుకుంటున్నాను.. మీకు నా శుభాకాంక్షలు.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు” అంటూ ట్వీట్ చేయడం జరిగిపోయాయి.

Related posts