telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

నిన్న లేని మెజారిటీ ఇప్పుడెలా వచ్చింది..బీజేపీకి శివసేన కౌంటర్..

sivasena fire on bjp's words

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు పోటీపడుతున్నాయి. రాష్ట్రపతి పాలన ముసుగులో భాజపా ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతోందంటూ శివసేన తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు ఈరోజు అధికారిక పత్రిక సామ్నాలో సంపాదకీయం ప్రచురించారు. తమ పార్టీకి 119మంది ఎమ్మెల్యే మద్దతుందన్న భాజపా నేత చంద్రకాంత్‌ పాటిల్‌ వ్యాఖ్యాల్ని తీవ్రంగా తప్పుబట్టారు. అవకాశం ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చేతులెత్తేసిన పార్టీ ఇప్పుడు ఎలా చేయగలదని నిలదీశారు. గతంలో లేని మెజార్టీ రాష్ట్రపతి పాలన నుంచి ఉద్భవిస్తుందా అని ప్రశ్నించారు. ‘క్రికెట్‌లో, రాజకీయాల్లో ఓడిపోతున్నట్లు అనిపించి, చివరికి గెలవడం కనిపిస్తుంది’ అని పరోక్షంగా మహారాష్ట్ర రాజకీయాల్ని ఉద్దేశించి కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యల్ని శివసేన ఉటంకించింది. ”క్రికెట్‌లో ఫిక్సింగ్‌ ప్రారంభమయింది.. అంటే గెలుపుపై ధీమా లేదు. అందుకే, మహారాష్ట్ర రాజకీయాల్ని గడ్కరీ ఉత్కంఠ రేకెత్తించే క్రికెట్‌తో పోల్చారు” అని రాసుకొచ్చారు.

ప్రస్తుతం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యాయి. ఈ మేరకు ఇప్పటికే మూడు పార్టీల మధ్య కనీస ఉమ్మడి కార్యక్రమం సిద్ధమైనట్లు సమచారం. ఇక అగ్రనేతలు సమ్మతి తెలపడమే తరువాయి. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం భాజపా మహారాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్ మాట్లాడుతూ.. తమకు 119మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వ్యాఖ్యానించారు. అయితే, గవర్నర్‌ అవకాశం ఇచ్చినప్పుడు లేని మెజార్టీ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందన్నది శివసేన వాదన. దీన్నిబట్టి ఎమ్మెల్యేల్ని భాజపా కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆరోపిస్తోంది.

Related posts