బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తనకు లభిస్తున్న ప్రజాదరణ నానాటికి తగ్గిపోతున్నట్లు తాజా ఒపీనియన్ పోల్స్ వెల్లడించటంతో తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ ఫలితాలు ఆయన్ను మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ నెల 12న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బ్రెగ్జిట్ విషయాన్ని తేల్చటంతోపాటు అధికారం మార్కెట్ అనుకూలశక్తుల కొమ్ము కాస్తున్న బోరిస్ జాన్సన్‌కా లేక సోషలిస్టుల నేతృత్వంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీకా అన్న విషయం తేలనున్నది.
మొత్తం 650 స్థానాలున్న పార్లమెంట్‌లో తమకు మెజార్టీ స్థానాలు దక్కి తిరిగి అధికార పగ్గాలను చేపడితే దేశ పాలనా వ్యవస్థలలో గణనీయమైన మార్పులు తీసుకువస్తామని ఆయన ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బ్రెగ్జిట్ అనివార్యమని, అది లేకుండా తాము ముందుకెళ్లలేమని ఆయన అన్నారు.