telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడింది – నారా లోకేష్ ట్వీట్

నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను అధికారులు కూల్చివేయడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా మండిప‌డ్డారు. నర్సీపట్నం పులిని చూసి పులివెందుల పిల్లి భయపడిందని లోకేష్ ఎద్దేవా చేశారు.

నోటీసులు ఇస్తామంటూ పోలీసుల అరెస్ట్ డ్రామా, దౌర్జన్యంగా ఇంటి గోడ కూల్చడం చూస్తుంటే జగ్గడు గట్టిగానే భయపడినట్టు కనిపిస్తుందంటూ నారా లోకేష్ కామెంట్ చేశారు.

పర్మిషన్ తీసుకున్నామని కుటుంబసభ్యులు వారిస్తున్నా అయ్యన్న ఇంటి గోడను నర్సీపట్నం మునిసిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. కక్షపూరితంగా అయ్యన్నపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఉత్తరాంధ్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనకు వచ్చిన జన జాతర, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత చూసి ఏపీ సీఎం పిరికిపంద చర్యలు మొదలెట్టారని విమర్శంచారు.

అయ్యన్నపాత్రుడిపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండించారు. మూడేళ్ల తరువాత కూడా ప్రతిపక్ష నేతల ఇళ్లు కూల్చడం, అరెస్టులనే నమ్ముకున్న సీఎం జగన్ రెడ్డి దుస్థితి చూస్తుంటే జాలేస్తుందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇదిలా ఉంటే.. నర్సీపట్నంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇంటిని ఈరోజు తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది కూల్చివేశారు. పంట కాల్వను అక్రమించి గోడ నిర్మించారని మున్సిపల్ సిబ్బంది చెబుతున్నారు.

ఈ క్రమంలోనే అయ్యన్న ఇంటి వెనకాల ఉన్న గోడను మన్సిపల్ సిబ్బంది జేసీబీతో కూల్చివేశారు. మరోవైపు అయ్యన్న ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మీడియాను కూడా లోనికి అనుమతి ఇవ్వడం లేదు. అయ్యన్నపాత్రుడి ఇంటివైపు వెళ్లే మార్గాలను పోలీసులు మూసివేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు అయ్యన్న ఇంటి వద్దకు చేరుకోకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.

Related posts