ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడికి శిక్ష పడేలా సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. దిశ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించిన రోజే గుంటూరులో మరో దారుణం వెలుగు చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్ల బాలికపై ఓదుర్మార్గుడు అత్యాచారానికి పాల్పడటం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.
చట్టాలు పదునెక్కుతున్నా దారుణాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా లోకేశ్ స్పందించారు. మహిళలు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని లోకేశ్ అన్నారు. ఐదేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టిన లక్ష్మణ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

