telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కర్ణాటకలోని ఉప ఎన్నికల్లోనూ బీజేపీ హవా…

కర్ణాటకలో అధికారంలో ఉన్న బీఎస్. యడియూరప్ప ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మారిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. బీజేపీ దూకుడుకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అయ్యింది. బీజేపీ దెబ్బకు ప్రతిపక్షాలు జీరో అయ్యాయి. బెంగళూరు సిటీలోని ఆర్ఆర్ నగర, తుమకూరు జిల్లాలోని శిరా ఉప ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యింది. బెంగళూరులోని ఆర్ఆర్ నగర, శిరాలో బీజేపీ అభ్యర్థులు బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. బెంగళూరు ఆర్ఆర్ నగర్ లో బీజేపీ అభ్యర్థి మునిరత్న మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. శిరాలో బీజేపీ అభ్యర్థి రాజేష్ గౌడ విజయం సాధించి శిరా రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేశారు. శిరా చరిత్రలోనే బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

బెంగళూరు నగరంలోని ఆర్ఆర్ నగర్ (రాజరాజేశ్వరినగర్)లో జరిగిన ఉప ఎన్నికల్లో తామే కచ్చితంగా గెలుస్తామని, హ్యాట్రిక్ గ్యారెంటీ అంటూ అధికార పార్టీ బీజేపీ అభ్యర్థి, ప్రముఖ సినీ నిర్మాత, వ్యాపారవేత్త, మాజీ ఎమ్మెల్యే కురుక్షేత్రం సినిమా ఫేమ్ మునిరత్న మొదటి నుంచి ధీమాగా ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న దివంగత ఐఏఎస్ అధికారి డీకే. రవి సతీమణి కుసుమా సైతం తాను కచ్చితంగా గెలిచి ప్రజాసేవ చేస్తానని అందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పారు. అయితే కుసుమా ఆశలు గల్లంతు అయ్యాయి.

బెంగళూరు సిటీలోని ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల లెక్కింపు వన్ సైడ్ గా జరుగింది. మంగళవారం ఉదయం నుంచి జరిగిన కౌంటింగ్ లో ప్రతి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి మునిరత్న భారీ మెజారిటీతో దూసుకుపోయారు. ఆర్ఆర్ నగర నియోజక వర్గం ఉప ఎన్నికల చివరి కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు బీజేపీ అభ్యర్థి మునిరత్నకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ ఇవ్వలేకపోయారు. చివరికి ఆర్ఆర్ నగర హీరో మునిరత్నం అని వెలుగు చూడటంతో బీజేపీ కార్యకర్తలు పండగ చేసుకున్నారు.

బెంగళూరు ఆర్ఆర్ నగర ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మునిరత్నకు 1, 25, 734 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుసుమాకు 67, 798ఓట్లు, జేడీఎస్ అభ్యర్థి క్రిష్ణమూర్తికి 10, 251 ఓట్లు మాత్రమే వచ్చాయి. అన్ని రౌండ్లు కలిపితే బీజేపీ అభ్యర్థి మునిరత్న 57, 936 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తమ సత్తా చాటుకుంటామని ముందునుంచి చెబుతూనే ఉన్నామని, మా నమ్మకాలు వమ్ముకాలేదని బీజేపీ మంత్రులు, నాయకులు అన్నారు.

తుమకూరు జిల్లాలోని శిరా శాసన సభ ఉప ఎన్నికలు జరిగాయి. మాజీ మంత్రి సత్యనారాయణ ఆకస్మిక మరణంతో శిరాలో ఉప ఎన్నికలు జరిగాయి. మంగళవారం కౌంటింగ్ జరిగింది. శిరాలో మొత్తం ఓటర్ల సంఖ్య 2. 15 లక్షల మంది. శిరా ఉప ఎన్నికల్లో మొత్తం 1, 77, 645 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. శిరా శాసన సభ నియోజక వర్గంలో అధికార పార్టీ బీజేపీతో పాటు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సత్యానారాయణ సతీమణి అమ్మాజమ్మతో పాటు 15 మంది స్వతంత్ర పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. ఇంతకాలం శిరాలో కాలర్ ఎగరేసిన జేడీఎస్ నాయకులు ఇప్పుడు ఆ పార్టీకి ఓటు వెయ్యకుండా చేతులు ఎత్తేయడంతో సీన్ రివర్స్ అయ్యింది.

శిరా శాసన సభ నియోజక వర్గంలో బీజేపీ నుంచి రాజేష్ గౌడ, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి టీబీ. జయచంద్ర, జేడీఎస్ పార్టీ నుంచి అమ్మాజమ్మ పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి రాజేష్ గౌడకు 74, 522 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి టీబీ. జయచంద్రకు 61, 573 ఓట్లు, జేడీఎస్ అభ్యర్థి అమ్మాజమ్మకు 35, 982 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి రాజేష్ గౌడ 12, 949 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇంత వరకు ఏ అసెంబ్లీ ఎన్నికల్లో శిరా నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి గెలవలేదు. మొదటిసారి శిరాలో బీజేపీ జెండా ఎగరేసింది. జేడీఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న శిరాలో బీజేపీ నాయకులు పాగా వెయ్యడంతో మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ, మాజీ సీఎం హెచ్.డీ. కుమార్ స్వామితో పాటు జేడీఎస్ పార్టీ నాయకులు షాక్ కు గురిఅయ్యారు..

Related posts