telugu navyamedia
రాజకీయ

కేంద్రమంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా

*కేంద్రమంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
*రాజ్య‌స‌భ ప‌ద‌వీకాలం ముగియడంతో రాజీనామా

*ఉపరాష్ట్రపతి రేసులో నఖ్వీ పేరు..

కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 

రేపటితో రాజ్యసభ ఎంపీగా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ పదవీ కాలం ముగుస్తుంది. ఆయన మళ్లీ రాజ్యసభకు బీజేపీ నామినేట్ చేయలేదు. ఎంపీగా లేకపోతే మంత్రిగా కొనసాగరాదన్న నిబంధన మేరకు ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. 

ఇదిలా ఉంటే.. చివరిసారిగా బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో నఖ్వీ పాల్గొనగా.. మంత్రిగా నఖ్వీ సేవలను ప్రశంసించారు ప్రధాని మోదీ. కేబినెట్‌ భేటీ అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంకు వెళ్లిన నఖ్వీ.. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

మైనారిటీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నఖ్వీను ఉపరాష్ట్రపతిని చేసే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

రాజ్యసభనూ సమర్థవంతంగా నడపగలిగే సత్తా ఆయనకు ఉందని.. కమలం పెద్దలు బలంగా విశ్వసిస్తున్నారు. మరి ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తారా? లేదంటే ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌కు పంపిస్తారా? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇప్పటకే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయింది. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జులై 5న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు కోసం జులై 19న చివరి తేదీ. 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల విత్ డ్రా‌ చేసుకునేందుకు ఈ నెల 22న చివరి తేదీ. పోటీ అనివార్యమైతే ఆగస్టు 6న ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనుంది. దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 

 

Related posts