యువత ఉద్యోగాల కోసం అల్లాడి పోతుంటే, మరోపక్క ప్రభుత్వాలు మాత్రం తాము లక్షల ఉద్యోగాలు సృష్టించినట్టు చెప్పుకుంటున్నాయి. ఇక దేశంలో నిరుద్యోగం తీవ్రమైందన్న చర్చ నేపథ్యంలో మోదీ సర్కార్ విడుదల చేసిన గణాంకాలు ఆసక్తి రేపుతున్నాయి. గత మూడేళ్లలోనే 3.79 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 2017-19 మధ్య ఈ ఉద్యోగాలు ఇచ్చినట్లు 2019-20 తాత్కాలిక బడ్జెట్‌లో తెలిపింది. 2017, 2018లలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 2,51,279 ఉద్యోగాలు సృష్టించామని, ఇది మార్చి 1, 2019నాటికి 3,79,544కు చేరుతుందని అంచనా వేసింది.
నిరుద్యోగం పెరిగిపోయిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొట్టింది. ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్, వాహనాల అమ్మకాల డేటా ఆధారంగా ఈ గణాంకాలను సేకరించినట్లు మోదీ చెప్పారు. రైల్వేస్, పోలీసు బలగాలు, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల శాఖల్లో చాలా వరకు ఉద్యోగాల కల్పన జరిగిందని లోక్‌సభకు మోదీ వివరించారు. మార్చి 1, 2019 నాటికి రైల్వేస్ మొత్తం 98999 ఉద్యోగాలు ఇచ్చినట్లు ఈ గణాంకలు వెల్లడించాయి. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మార్చి 1, 2019 నాటికి అదనంగా 79,353 ఉద్యోగాలు రానున్నట్లు తేలింది.