పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రులు సరిదిద్దటం చూస్తుంటాం.. కానీ ఇక్కడ ఆ తప్పు తీవ్రతను బట్టి తండ్రి మరో అడుగు ముందుకేసి, కొడుకుకు చెంపపెట్టుగా నిర్ణయం తీసుకోని, ధర్మం తప్పితే ఎవరైనా ఒకటే అని నిరూపించాడు. కొడుకు మోసం చేసి వదిలేసిన యువతికి అతని తండ్రి అండగా నిలిచాడు. వేరొక వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి తన యావదాస్తిని ఆ యువతి పేరిట రాసిచ్చి కొడుకుకి షాక్ ఇచ్చాడు. కేరళ రాష్ట్రంలోని కొట్టాయం జిల్లా తిరునక్కారం గ్రామంలో నివసిస్తున్న షాజీకి ఓ కుమారుడు. షాజీ కొడుకు ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. విషయం షాజీకి తెలియడంతో వారిద్దరు మైనర్లు కావడంతో కొంతం కాలం తరువాత పెళ్లి చేస్తానని మాటిచ్చాడు.
ఈ మధ్య కాలంలో షాజీ కుమారుడికి మరో యువతితో పరిచయం ఏర్పడింది. దీనిని అతని మొదటి ప్రియురాలు నిలదీయడంతో ఆమెను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. ఈ విషయం ఊరంతా తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. విషయం తెలుసుకున్న షాజీ, కొడుకును, అతని మొదటి ప్రియురాలిని కూర్చోబెట్టి రాజీ ప్రయత్నం చేశాడు. కానీ కొడుకు ససేమిరా అనడంతో యువతికి న్యాయం చేయాలని షాజీ నిర్ణయించుకున్నాడు. ఆయనే స్వయంగా ఓ యువకుడికి ఇచ్చి ఆమెకు వివాహం చేసి తన యావదాస్తిని ఆమె పేరు మీద రాసి కొడుకుకు షాక్ ఇచ్చాడు.