telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్‌కు త్వరలో ఝలక్ ఇస్తా-జగ్గారెడ్డి

జగ్గారెడ్డికి రేవంత్ రెడ్డి ఝలక్ అని వార్తలు వస్తున్నాయి .. కానీ నేనే త్వరలో రేవంత్ కు ఝలక్ ఇస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ టైపు అయ్యింది నా పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.. నేను హీరోయిన్.. హీరో కాంగ్రెస్ పార్టీ .. విలన్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు.. రేవంత్‌రెడ్డికి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వలేదు అని వ్యాఖ్యానించారు.

టీడీపీలో ఉన్న సమయంలో సోనియాగాంధీని బలి దేవత అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను జగ్గారెడ్డి మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఈ వీడియోలన్నీ సోనియాగాంధీ దృష్టికి వెళ్లలేదని జగ్గారెడ్డి చెప్పారు. తాను కూడా పీసీసీ చీఫ్‌ పదవి ఆశించానని, అయితే రాహుల్‌తో పోట్లాడే స్థాయి తనది కాదని అందుకు మౌనంగా ఉన్నట్లు చెప్పారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న తాను ప్రస్తుతం శీల పరీక్ష ఎదుర్కోవాల్సిన పరిస్ధితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడే స్వభావం నాది. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాను. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం ఇవ్వవద్దని…. ఇస్తే పార్టీ నష్టపోతుందని చెప్పి తెలంగాణ ద్రోహిగా ముద్ర పడ్డానని ఆయన అన్నారు. ఇప్పటికీ అదే స్టాండ్ తో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు.

రేవంత్ క్యారెక్టర్ విచిత్రంగా ఉంటుందని..ఇటీవల సీఎల్పీ కార్యాలయంలో తనను కలిసిన సమయంలో తమ మధ్య వివాదం గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. తనతో కలిసి ఫోటోలకు రేవంత్ రెడ్డి పోజులు ఇచ్చిన తర్వాత 20 నిమిషాల పాటు తమ మధ్య ఎలాంటి విబేధాలపై చర్చించలేదన్నారు. కలిసి పనిచేద్దామని కూడా రేవంత్ రెడ్డి చెప్పలేదని జగ్గారెడ్డి వివరించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ కు సీరియస్ గా ఉందని తనకు సమాచారం ఉందన్నారు. కేసీఆర్ కు ఏమైనా కావొచ్చన్నారు. యశోదా ఆసుపత్రి, ప్రగతి భవన్ గవర్నర్ కార్యాలయం వద్ద పోలీసులు రక్షణ ఏర్పాటు చేశారన్నారు. మనమంతా అలెర్ట్ గా ఉందామని తనకు రేవంత్ రెడ్డి చెప్పారన్నారు

Related posts