telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

స్థానికుల‌కే ప్ర‌భుత్వ ఉద్యోగాలు : కేటీఆర్

నూత‌న జోన‌ల్ వ్య‌వ‌స్థ ఆమోదించిన ముఖ్య‌మంత్రి శ్రీ కేసీఆర్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇక నుంచి స్థానికుల‌కే ఉద్యోగాలు ల‌భిస్తాయ‌ని, ఎలాంటి వివ‌క్ష లేకుండా స‌మాన అవ‌కాశాలు ద‌క్కుతాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

స్థానికుల‌కే ప్ర‌భుత్వ ఉద్యోగాలు
తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఉమ్మ‌డి ఏపీలో ఉన్న జోన‌ల్ వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా ర‌ద్దు చేసిన అనంత‌రం.. నూతన జోనల్ వ్యవస్థ రూపుదిద్దుకుందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దీంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయన్నారు.

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు..
ప్రజల ఆకాంక్షల మేరకు పాలన ప్రయోజనాలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేందుకు జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేశామ‌ని కేటీఆర్ తెలిపారు. దీంతో పాటు ఆయా జిల్లాలను ప్రత్యేక జోన్లుగా వర్గీకరించామ‌న్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణ్ పేట జిల్లాలను ఆయా జోన్లలో చేర్చి చట్టబద్ధం చేయడంతో పాటు, వికారాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు ఆ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవడం పట్ల ఆయా జిల్లాల ప్రజల తరఫున ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని మించి వివిధ శాఖల ద్వారా 1,33,000 చిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను రాష్ట్ర యువతకి అందించామ‌ని కేటీఆర్ తెలిపారు.

ప్ర‌యివేటు రంగంలో 15 ల‌క్ష‌ల ఉద్యోగాలు
కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా గత ఏడేళ్లలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, వేల పరిశ్రమలు రాష్ట్రం ఆక‌ర్షించింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. తద్వారా సుమారు 15 లక్షల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో వచ్చాయన్నారు. ఒకవైపు ప్రభుత్వం ఇచ్చే ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే అవకాశాలు దక్కేలా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలలో ఇక్కడి యువతకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేలా మరో విధానపరమైన నిర్ణయం తీసుకున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేటు రంగాల్లో స్థానిక యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు దొరికేలా చర్యలు తీసుకుటున్న సీఎం కేసీఆర్‌కు రాష్ట్ర ప్రజలు, యువత పక్షాన కేటీఆర్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Related posts