telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

తెలంగాణలో బీజేపీ ‘ప్రజా సంగ్రామ యాత్ర’

తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే క్రమంలో భారతీయ జనతా పార్టీ ‘ప్రజా సంగ్రామయాత్ర’తో సమరశంఖం పూరిస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ మహానగరంలోని చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్‌ నుంచి యాత్రకు శ్రీకారం చుట్టారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్ ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా చార్మినార్ చేరుకున్న బండి సంజయ్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది.

ప్రజా సంగ్రామ యాత్రతో సమరానికి సై అంటోంది. తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం నింపేందుకే ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతున్నట్లు బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు రానున్నాయని అన్నారు. రాజకీయ మార్పునకు ఈ యాత్ర వేదిక కానుందని అన్నారు. యాత్రకు ప్రజలు సహకరించాలని, ఈ యాత్రను హైకమాండ్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అన్నారు. పాదయాత్ర ప్రారంభించే ముందు బీజేపీ కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పూజలు చేశారు. బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద
సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ సాధనకోసం 1400 మంది ప్రాణ త్యాగం చేశారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేరని, అమరుల ఆశయాలకు, ఆకాంక్షలకు భిన్నంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని అన్నారు. దళితబంధు పేరుతో దళితులను, గొర్రెలు, బర్రెలు అంటూ బీసీలను వంచిస్తున్నారని అన్నారు. రైతులందరికీ ఉచిత యూరియా ఇస్తానని మోసం చేశారని, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి అంటూ యువకులను మోసం చేశారని ఆరోపించారు. ఒక్కో నిరుద్యోగికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం లక్ష చొప్పున బాకీ ఉన్నారని అన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. అక్టోబర్ 2 వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.

పాదయాత్రతో తెలంగాణలో సునామీని సృష్టించబోతున్నామన్నామని బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్ తెలిపారు. రాష్ట్రంలో పార్టీ జెండా ఎగిరేవరకు ప్రతికార్యకర్త కష్టపడాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకే ప్రజా సంగ్రామ యాత్ర ఉద్యమం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నీతివంతమైన పాలన రావాలంటే కుటుంబ పాలన అంతంకావాలని అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలో కుట్రలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ జెండాను రెపరెపలాడిస్తామని అన్నారు.

Related posts