మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మంత్రి తలసాని ఆధ్వర్యంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలంతా ఇటీవల సమావేశమయ్యారు. సినిమా ఇండస్ట్రీలో సమస్యలు, షూటింగ్ లకు అనుమతులు వంటి వాటిపై చర్చించారు. ఈ సమావేశానికి బాలకృష్ణ తప్ప మిగతా వాళ్ళు హాజరయ్యారు. ఇదే విషయం పై స్పందించిన బాలయ్య కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయట. నాకు తెలియదు. వార్తలు, పేపర్ల ద్వారా తెలుసుకున్నాను. మరి, (తెలంగాణ ప్రభుత్వంతో) ఏం చర్చలు జరుగుతున్నాయో నాకు తెలియదు’’ అని నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ‘‘మీటింగులు జరిగాయి. నన్ను పిలిచారా? ఎవరూ పిలవలేదు. వాళ్లు అందరూ కలిసి హైదరాబాద్‌లో భూములు పంచుకుంటున్నారా? (మంత్రి తలసాని) శ్రీనివాస యాదవ్‌తో కూర్చుని?? మళ్లీ ఎప్పుడు షూటింగులు స్టార్ట్ అవుతాయని మీటింగులు జరిగాయి. నన్ను ఒక్కడు పిలవలేదు. భూములు పంచుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎవరికి భయపడతాం? వక్రీకరించేది ఏంటి… ఇది వాస్తవం’’ అని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందిస్తూ.. ‘‘ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు తప్ప… భూములు పంచుకోవడానికి ఎవరూ వెళ్లలేదు. నాతో సహా చాలామందిని పిలవలేదు. భూములు పంచుకుంటున్నారని అనడం ఏంటి? ఇండస్ట్రీపై మీకున్న గౌరవం ఇదేనా? తప్పుగా మాట్లాడారు. మీరు చిత్రపరిశ్రమను మాత్రమే కాదు, తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించారు. ఇండస్ట్రీకీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వానికీ క్షమాపణలు చెప్పండి. అది మీ బాధ్యత’’ అన్నారు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడటం సరికాదని, బాలయ్య మాట్లాడింది చాలా తప్పని నాగబాబు ఖండించారు. బాలకృష్ణ వ్యాఖ్యలు పరిశ్రమనే కాకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని అవమానించేలా ఉన్నాయని” నాగబాబు అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరు చేశారో, తెలుగుదేశం పార్టీని నమ్మితే సామాన్యుల జీవితాలు ఎలా నాశనం అయ్యాయో.. ఒకసారి ఏపీకి వెళ్తే తెలుస్తుందని” అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఏపీని ఎవరు సర్వనాశనం చేశారని ఆయన ప్రశ్నించారు. బాలకృష్ణ ఏం మాట్లాడినా నోరుమూసుకుని కూర్చోమని, ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ కాదు , కేవలం హీరోనే అని నాగబాబు అన్నారు.
previous post