ఆర్టికల్ 370 రద్దు తరువాత, కశ్మీర్ అమ్మాయిలకు, ఇతర రాష్ట్రాల్లోని వారిని వివాహం చేసుకునే అవకాశం లభించగా, తొలి వివాహం జరుగనుంది. తాజాగా, ఓ కశ్మీరీ యువతి, రాజస్థాన్ కు చెందిన యువకుడిని పెళ్లి చేసుకోనుంది. మోదీ సర్కారు తీసుకున్న సంచలన నిర్ణయం తరువాత, ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఓ కశ్మీర్ అమ్మాయిని పెళ్లాడటం ఇదే ప్రథమం. వీరిద్దరికీ గతంలోనే పరిచయం ఉందని, ఆ పరిచయం ప్రేమగా మారగా, పరిస్థితులు కలిసి రావడంతో, వీరు పెళ్లికి సిద్ధమయ్యారని సమాచారం. వీరిద్దరి మధ్యా రెండేళ్లుగా ప్రేమ నడుస్తున్నప్పటికీ, పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. మోదీ సర్కారు పుణ్యమాని వీరు ఒకటి కానున్నారు. రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ కు చెందిన అక్షయ్, కొంతకాలం ముందు న్యూఢిల్లీలో ఉద్యోగం చేశాడు. అదే సమయంలో కశ్మీర్ కు చెందిన కామినీ రాజ్ పుత్, ఢిల్లీలోని తన అత్త నివాసంలో కొన్ని రోజులు గడిపింది.
అప్పుడు వారిరువురి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే, అమ్మాయికి ఉన్న ప్రత్యేక హక్కులను కోల్పోతుందని తల్లిదండ్రులు భయపడి పెళ్లికి అడ్డు చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుతో అడ్డంకులు తొలగిపోగా, సామాజిక వర్గాలు వేరైనా, ఇద్దరూ తమ పెళ్లికి కుటుంబ పెద్దలను ఒప్పించారు. ఇప్పుడు తామిద్దరమూ ఎంతో సంతోషంగా ఉన్నామని, మోదీ సర్కారుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామని అక్షయ్ అంటున్నాడు. వీరిద్దరికీ ఇప్పుడు ఎంగేజ్ మెంట్ జరుగగా, మరో రెండు వారాల్లో వివాహాన్ని వైభవంగా నిర్వహించాలని పెద్దలు నిశ్చయించారు.
టీడీపీకి రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే ముఖ్యం: మంత్రి కన్నబాబు