నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో నిండు కుండలా కళకళలాడుతుంది. ఇప్పటికే సాగర్ ప్రాజెక్టు 2 క్రస్ట్ గేట్లను ఎత్తి 81000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేశారు. రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి ఉన్నందున ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల ఉంటుందని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. నిలిచిన ఇన్‌ఫ్లో ఎగువ ప్రాంతాల నుంచి నాగార్జునసాగర్‌కు ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోగా.. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను సాయంత్రం నాటికి 589.80 అడుగులుగా ఉంది.
రిజర్వాయర్‌లో 311.4474 టీఎంసీల నీరు నిల్వ ఉంది . నాగార్జునసాగర్ జలాశయం నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 33130 క్యూసెక్కులు, కుడికాల్వ ద్వారా 9189 క్యూసెక్కులు, ఎడమకాల్వ ద్వారా 8896 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 300 క్యూసెక్కులు, డీటీ గేట్స్ (డైవర్షన్ టన్నల్ ) ద్వారా 10 నీటి విడుదల కొనసాగుతుంది. రిజర్వాయర్ ద్వారా మొత్తం 53925 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.