మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌కు 90వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం లతా మంగేష్కర్ జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెను అభినందనల్లో ముంచెత్తగా ఒకరోజు ఆలస్యంగా ప్రధాని మోదీ నుంచి ఆమె శుభాకాంక్షలు అందుకున్నారు. తాను ఏడు రోజుల అమెరికా పర్యటనకు బయలుదేరేముందు ఆమెకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశానని ప్రధాని గుర్తు చేసుకున్నారు. లతా మంగేష్కర్‌కు ప్రధాని జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఆరోగ్యకర జీవితం గడుపుతూ ఆహ్లాదంగా ఉండాలని, తమను దీవించాలని ఆకాంక్షించారు.
గాయని లతాజీ మనందరి కంటే వయసులో పెద్దవారని, దేశంలో భిన్న దశలను వారు చూశారని, వారిని అందరూ దీదీగా గౌరవిస్తారని పేర్కొన్నారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీకి లతా మంగేష్కర్ ధన్యవాదాలు తెలిపారు. మీ రాకతో దేశ ముఖచిత్రం మారిన విషయం తనకు తెలుసని, ఇది తనకు ఎంతో సంతోషం కలిగిస్తోందని ఆమె బదులిచ్చారు. కాగా లతాజీ జన్మదినం సందర్భంగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచన్ నుంచి ధర్మేంద్ర, హేమమాలిని, శ్రేయా ఘోషల్ వంటి ఎందరో నటులు, సెలబ్రిటీలు ఆమెకు ట్విటర్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే.