తెలంగాణలో చేనేతకు చేయూత ఇచ్చేందుకు కోటి చీరల పంపిణీ జరుగుతుందని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం నల్గొండ వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.
ఆడపడుచులకు చిరుకానుకగా చీరలను అందిస్తున్నామని చెప్పారు. కోటి చీరలను నాణ్యతతో నేసి ఆడబిడ్డలకు అందిస్తున్న నేతన్నకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి మగ్గానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి సంవత్సరం చాలా కష్టపడి నేతన్నలు చాలా చక్కని చీరలు తయారు చేశారని ప్రశంసించారు. చీరల పంపిణీ కార్యక్రమం సవ్యంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.