ఏపీ శాసనసభ మాజీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం లింగారావుపాలెంలో నిర్మించిన దిమ్మెను ధ్వంసం చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో మండిపడ్డారు.
కోడెలగారిని తప్పుడు కేసులతో వేధించారని, ఆయన చనిపోయిన తర్వాత కూడా పగతీర్చుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలను ఏమనుకోవాలి? అని ప్రశ్నించారు. మూడు దశాబ్దాల పాటు ప్రజాసేవలో కొనసాగిన కోడెల విగ్రహాన్ని పార్టీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసుకోవడం తప్పా? అంటూ ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటు దిమ్మెను కూల్చడం ఏంటి? అంటూ ట్విట్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.