మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై తెలంగాణ జన సమితి(టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం స్పందించారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రెస్ క్లబ్ లో టీజేఎస్ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దిశ తరహా ఘటనలు మళ్లీ జరుగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణలో మహిళా కమిషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేసి భాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
ఇలాంటి అఘాయిత్యాలను నిరోధించడానికి ఎన్ కౌంటర్లు పరిష్కారం కాదన్నారు. ఎన్ కౌంటర్లతో సమస్యలు తీరవని చెప్పారు. ఇటీవల వరంగల్ లో యువతిపై జరిగిన హత్యాచార ఘటనపై మాట్లాడారు. అత్యాచారాలు, హత్యలు తదితర నేరాలను అరికట్టాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందన్నారు. వరంగల్ యువతిపై జరిగిన హత్యాచార ఘటనపై వెంటనే విచారణ జరిపించాలన్నారు.