telugu navyamedia
క్రీడలు వార్తలు

నా ఎదుగుదలలో న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ దే ప్రధాన పాత్ర : బుమ్రా

డెత్ ఓవర్లలో అద్భుత యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను బోల్తాకొట్టిస్తాడు జస్ప్రీత్ బుమ్రా. కెరీర్ ఆరంభించిన అనతి కాలంలోనే ప్రపంచంలో ఉన్న ఉత్తమమైన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు. ఇప్పటికే ఎంతో మంది దిగ్గజాల చేత ప్రశంసలు అందికున్నాడు. అయితే తన కెరీర్‌ ఎదుగుదలలో న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ షేన్‌ బాండ్ ప్రధాన పాత్ర పోషించాడని బుమ్రా తెలిపాడు. ఐపీఎల్ ప్రాంచైజ్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్‌గా షేన్‌ బాండ్‌ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కూడా చాలా కాలంగా ఆడుతున్నాడు. షేన్‌ బాండ్‌తో తనకున్న అనుబంధం గురించి బుమ్రా మాట్లాడిన వీడియోని ముంబై ఇండియన్స్‌ శుక్రవారం ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో షేన్‌ బాండ్, ట్రెంట్‌ బౌల్ట్‌, ఆడమ్‌ మిల్నె, జిమ్మీ నీషమ్‌ కూడా మాట్లాడారు. చిన్నప్పటి నుంచే బాండ్ బౌలింగ్‌ని చూస్తున్నానని, మొదటిసారిగా 2015లో కలిశానని యార్కర్ కింగ్ చెప్పాడు. ‘నేను షేన్‌ బాండ్‌ని మొదటిసారిగా 2015లో కలిశాను. నా చిన్నప్పటి నుంచే అతని బౌలింగ్‌ని చూస్తున్నా. నా బౌలింగ్‌ జట్టుకు ఎలా ఉపయోగపడుతుందా? అని ఎప్పుడూ ఆలోచిస్తూ అందుకు తగినట్టుగా బౌలింగ్ చేసేవాడు. నేను క్రికెటర్‌గా రాణించడానికి ఎంతో సహకరించాడు. ఆయనను కలవడం మంచి అనుభవం. మైదానంలో ప్రయత్నించే విభిన్న కోణాలపై సూచనలిస్తూ సహకరించేవాడు. నేను ఎక్కడ ఉన్నా, భారత జట్టుతో ఉన్నప్పుడు కూడా బాండ్‌తో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను’ అని జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు.

Related posts