హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సతీమణి నిర్వహిస్తున్న జమున హేచరీస్ పేరుతో నిర్వహిస్తు్న్న కోళ్ల ఫారాలు ఆక్రమిత స్థలంలో ఉన్నాయని మెదక్ కలెక్టర్ హరీశ్ వెల్లడించారు. ఈటెల రాజేందర్ భూ ఆక్రమణలపై వచ్చిన ఆరోపణలతో సర్వేనిర్వహించిన తర్వాత నివేదిక రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. మెదక్ జిల్లాలో ఈటెల రాజేందర్ కు సంబంధించిన భూ ఆక్రమణల ఆరోపణలపై కలెక్టర్ హరీశ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమునా హేచరీస్ కు సంబంధించిన కోళ్లఫారాలకు సంబంధించిన షెడ్లు అసైన్డ్ భూముల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. 56 మందికి సంబంధించిన లబ్ధిదారులకు సంబంధించిన 70ఎకరాల 33సెంట్ల భూమి కబ్జా చేసినట్లు సర్వేలో తేలిందని కలెక్టర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా అచ్చంపేట, హకీంపేట పరిధిలో అసైన్డ్ భూములు కబ్జా గురైనట్లు పరిశీలనలో తేలిందన్నారు. జమునా హేచరీస్ యాజమాన్యం కబ్జా చేసిన అసైన్డ్ భూములను వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారని తెలిపారు.
అనుమతులు లేకుండా పెద్ద పెద్ద షెడ్లు నిర్మించిన విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. నిషేధిత జాబితాలోని భూములను జమున హేచరీస్ పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి అటవీప్రాంతంలో చెట్లు నరికి, రోడ్లు వేశారని, పౌల్ట్రీ నుంచి కాలుష్యం వెదజల్లుతున్నట్లు గుర్తించామని అక్కడి పరిస్థితులను వివరించారు. అసైన్డ్ భూముల కబ్జా, అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై, సహకరించిన అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత అసైనీలకు న్యాయం చేసేలా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని వెల్లడించారు.