అర్హులైన కాపు మహిళలకు ప్రతి ఏడాది రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని సీఎం జగన్ ల్యాప్ టాప్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గత టీడీపీ, నేటి వైసీపీ ప్రభుత్వ పాలనలోని తేడాలను చూడాలని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసిందో చూడండంటూ పలు వివరాలు వెల్లడించారు.
ప్రతి ఏడాది కాపులకు రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఏడాదికి సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చిందని జగన్ తెలిపారు. తమ ప్రభుత్వం మాత్రం పలు పథకాల ద్వారా ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్ల మొత్తాన్ని కాపు కులస్తులకు ఇచ్చిందని తెలిపారు.
అధికారంలోకి వచ్చాక దేవుడి దయ వల్ల, ప్రజల దీవెనలతో తాము ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగామని జగన్ చెప్పారు. ఇప్పటివరకు 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా సాయం చేశామని తెలిపారు. లబ్దిదారులకు బ్యాంక్ ఖాతాల్లో నగదును జమ చేశామమని తెలిపారు. ఏ పార్టీకి చెందిన వ్యక్తులని చూడకుండా అర్హులందరికీ లబ్ది చేకూర్చుతున్నామని జగన్ తెలిపారు.