telugu navyamedia
సినిమా వార్తలు

“జబర్దస్త్” వినోద్ కేసు… లొంగిపోయిన నిందితులు…

“జబర్ధస్త్” కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల ఈ ప్రోగ్రామ్‌లో ఆడ వేషంతో అలరించే వినోద్‌పై హత్యాయత్నం జరిగింది. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కాచిగూడ పరిధిలోని కుత్బిగూడలో వినోద్‌ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఓ ఇంటి వివాదంలో వినోద్ పై తీవ్రంగా దాడి చేశారు. ఇంటి కొనుగోలుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులకు రూ.10 లక్షలు ఇచ్చానని, అయితే ఎంతకీ రిజిస్ట్రేషన్ చేయించకపోవడంతో పాటు, తన డబ్బు కూడా వెనక్కి ఇవ్వకపోవడంతో నిలదీశానని వినోద్ వెల్లడించాడు. సెటిల్మెంటు చేసుకుందాం రమ్మని చెప్పి తనపై హత్యాయత్నం చేశారని తెలిపాడు. రూ.10 లక్షలు అడ్వాన్స్ రూపంలో ఇచ్చానని, అయితే ఇల్లు ఇవ్వం, డబ్బులు ఇవ్వం పొమ్మని అవతలి వ్యక్తులు దౌర్జన్యం చేశారని వినోద్ వాపోయాడు. ఇంటి పైకి పిలిచి గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశారని వివరించాడు. తప్పించుకుని కిందికి రాగా, వెంటపడి మరీ కడుపులో తన్నారని, తల చిట్లిందని, ఎముకలు విరిగిపోయాయని చెబుతూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ ఘటనలో వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు.

తీవ్రంగా గాయపడ్డ వినోద్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో వినోద్ దాడి చేసిన నిందితులు హైదరాబాద్, నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. వినోద్ పై దాడి చేసిన వారిలో ఇంటి యజమాని బాలాజీ, అతని భార్య ప్రమీల వారి కుమారులతో పాటు పెద్ద కోడలు ఉన్నారు. ఈ కేసులో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎన్టీ అట్రాసిటీ చట్టంతో పాటు సెక్షన్ 324, 506 కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితులంతా న్యాయమూర్తి ముందు హాజరు కావడంతో, ఆయన వారికి రిమాండ్ ను విధించారు. దీంతో పోలీసులు వారిని చంచల్ గూడ జైలుకు తరలించారు.

Related posts