telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

భారత్ క్లీన్ స్వీప్ చేస్తుందా.. నేడే మూడో టెస్ట్..

india with clean sweep idea

భారత జట్టు సొంత గడ్డపై ఎదురు లేకుండా దూసుకెళుతోంది. దక్షిణాఫ్రికాపై ఇప్పటికే 2-0తో సిరీస్‌ అందుకుంది. గతంలో ఇలాంటి పరిస్థితిలో చివరి మ్యాచ్‌కు ఎలాంటి ప్రాధాన్యత ఉండేది కాదు. మహా అయితే రిజర్వ్‌ బెంచీని పరీక్షించేందుకు సిద్ధమయ్యేది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రతీ టెస్టు విజయం కూడా టెస్టు చాంపియన్‌షిప్ లో కీలకమే కావడంతో కోహ్లీ సేన మరింత కసితో బరిలోకి దిగబోతోంది. ఇప్పటిదాకా టెస్టు ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాను భారత జట్టు క్లీన్‌స్వీప్ చేయలేదు. ఇప్పుడా లోటును అధిగమించడంతో పాటు విలువైన 40 పాయింట్లను ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. అటు పర్యాటక జట్టు కనీసం డ్రాతోనైనా పరువు కాపాడుకోవాలనుకుంటోంది.

ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ ఆరంభమయ్యాక ఏ మ్యాచ్‌ కూడా ‘డెడ్‌ రబ్బర్‌’గా భావించలేని పరిస్థితి. అందుకే శనివారం నుంచి రాంచీలో జరిగే చివరి టెస్టు కూడా హోరాహోరీగానే సాగే అవకాశముంది. రెండో టెస్టు విజయానంతరం భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. చివరి టెస్టులోనూ తమ ఆటతీరులో మార్పు ఉండదని తెలిపాడు. దక్షిణాఫ్రికా మాత్రం కేశవ్‌ మహరాజ్‌, మార్‌క్రమ్‌ గాయాల కారణంగా మరీ బలహీనంగా తయారైంది. ప్రస్తుతం టెస్టు చాంపియన్‌షి్‌ప పట్టికలో భారత్‌ (4 మ్యాచ్‌లు) ఖాతాలో అత్యధికంగా 200 పాయింట్లున్నాయి. అటు కివీస్‌, శ్రీలంక (రెండేసి మ్యాచ్‌లు) కేవలం 60 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి. ఒకవేళ భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిస్తే 240 పాయింట్లతో తిరుగులేని స్థాయిలో ఉంటుంది.

Related posts