telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పాకిస్థాన్‌ డ్రోన్ల దృష్ట్యా .. పంజాబ్ సరిహద్దులలో హైఅలర్ట్ ..

high alert in punjab boarder on pak drones

గత కొన్ని రోజులుగా దేశ సరిహద్దులో పాకిస్థాన్‌ అనుమానిత డ్రోన్లు సంచరిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. సరిహద్దు ప్రాంతాలలో అధికారులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఆ డ్రోన్లు చక్కర్లు కొడుతూ ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నకిలీ కరెన్సీ, మాదకద్రవ్యాలను జారవిడుస్తున్నాయన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పంజాబ్‌ – హిమాచల్‌ – పాకిస్థాన్‌ సరిహద్దును పంజాబ్‌ పోలీసులు జల్లెడపడుతున్నారు. పంజాబ్‌, పఠాన్‌కోట్‌ల మీదుగానే పాక్‌ డ్రోన్లు సరిహద్దును దాటి దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న దృష్ట్యా వాటిని అడ్డుకొనేందుకు గట్టి నిఘా ఉంచారు.

హిమాచల్‌ అటవీ ప్రాంతంలో పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఈ సోదాల్లో పఠాన్‌కోట్‌, నూర్పూర్‌ డీఎస్పీలు పాల్గొన్నారు. ఇల్లు, నివాస స్థావరాలను కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. అలాగే, ఆ ప్రాంతంలో ప్రయాణించే వ్యక్తుల గుర్తింపు కార్డులను సైతం తనిఖీ చేశారు. దీనిపై డీఎస్పీ రాజేందర్‌ మన్‌హాస్‌ మాట్లాడుతూ.. పండుగల దృష్ట్యా హై అలర్ట్‌ ప్రకటించామని వెల్లడించారు. అలాగే, హిమాచల్‌ ప్రదేశ్‌ పోలీసులతో కలిసి పంజాబ్‌ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పంజాబ్‌ – హిమాచల్‌ప్రదేశ్‌ – పాకిస్థాన్‌ సరిహద్దు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారని ఆయన తెలిపారు.

Related posts