telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

మెల్లగా నడిచే వారికి… కరోనా ముప్పు ఎక్కువే !

కరోనా మహమ్మారితో అర్ధంతరంగా పలువురు తనువు చాలిస్తుండగా తాజా సర్వే మరో షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టింది. వేగంగా నడిచేవారితో పోలిస్తే మెల్లగా నడిచేవారు కొవిడ్‌-19 తో మరణించే ముప్పు నాలుగింతలు అధికమని, తీవ్ర లక్షణాలుండే వైరస్‌ స్ట్రెయిన్‌ బారిన పడే ముప్పు రెండు రెట్లు అధికమని యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌లో బయోమెడికల్‌ పరిశోధనా కేంద్రానికి చెందిన పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. “స్థూలకాయం, నడిచే వేగం, కరోనా, మరణాలు : యూకే బయోబ్యాంక్‌ విశ్లేషణ ” పేరుతో ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఒబెసిటీలో ప్రచురితమైన అధ్యయన నివేదిక ఈ వివరాలు వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాధి బారిన పడేందుకు, వ్యాధి తీవ్రతకు స్థూలకాయం కీలక ముప్పుగా ఈ నివేదిక పేర్కొంది. ఇక బ్రిస్క్‌ వాకర్స్‌తో పోలీస్తే సాధరణ బరువు కలిగిన మెల్లగా నడిచే వారు వైరస్‌ కారణంగా మరణించే ముప్పు 3.75 రెట్లు అధికమని లీసెస్టర్‌లో ఆరోగ్య పరిశోధకులు పేర్కొన్నారు. 4,00,000 మందికి పైగా మధ్యవయస్కుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం చేపట్టారు. వేగంగా నడిచేవారితో పోలిస్తే మెల్లగా నడిచేవారు కొవిడ్‌ బారిన పడే అవకాశాలు రెండున్నర రెట్లు అధికమని పరిశోధకులు కనుగొన్నారు. మెల్లగా నడిచేవారు స్థూలకాయులైనా, సాధారణ బరువున్నా ముప్పు మాత్రం ఒకేరకంగా అధికంగా ఉన్నట్టు గుర్తించారు.

Related posts