telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

నట్టి కుమార్ ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన తెలుగు సినీ ప్రముఖులు

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను పలువురు తెలుగు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించడంతో పాటు ఆయనకు తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్   కౌన్సిల్ హాల్ లో చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమ తరపున సీనియర్ నిర్మాత నట్టి కుమార్ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం జరిగింది. . ఇందులో పలువురు నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతోపాటు సినీ పరిశ్రమలోని వివిధ శాఖలకు చెందినవారు పాల్గొన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ మాట్లాడుతూ, “అభివృద్ధికి పర్యాయపదం చంద్రబాబు గారు. . విజనరీ రూపకల్పనలో ఆయనకు ఆయనే సాటి. ముందుచూపుతో ఆయన చేసిన అభివృద్ధి ఫలాలను రెండు రాష్ట్రాల ప్రజలు ఆస్వాదిస్తున్నారు. బహుశా ఏ ముఖ్యమంత్రి చంద్రబాబులా నిరంతరం పరితపించి ఉండరు ఒక్క ఐటీ రంగమే కాదు వ్యవసాయ రంగ అభివృద్ధి మొదలుకుని పరిశ్రమల వరకు ప్రతీ రంగం అభివృద్ధికి విశేష కృషి సల్పిన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది.పట్టిసీమతో నదుల అనుసంధానాన్ని సైతం ఆయన చేసి చూపించారు. అప్పట్లో ఆయన ఇంకో ఆరు నెలలు ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే, ఏపీకి జీవనాడి అయిన పోలవరం కూడా ,పూర్తయి ఉండేది. అలాంటి అద్భుత విజనరీ నాయకుడిపై రాజకీయ కక్షతో కుట్ర కేసులు పెట్టి, జైలులో పెట్టడాన్ని ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు, ఆయనపట్ల తమకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్య, చంద్రులకు కూడా గ్రహణం పడుతుంది. అది కొద్ది సమయమే ఉంటుంది. చంద్రబాబుకు కూడా ఆ గ్రహణం విడిపోయి, కడిగిన ముత్యంలా ఆయన ప్రజా జీవితంలోకి తిరిగొస్తారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తూ, ఎప్పుడూ బయటకు రాని కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రహ్మణి గార్లు కూడా బయటకు వచ్చి, ఈ అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. వాళ్లు ప్రజల్లోకి వెళితే బావుంటుందని రాజమండ్రిలో వారికి నేను సూచించాను” అని అన్నారు.

ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ, ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు జైలులో ఉన్నారంటే ప్రజలకే కష్టాలు వచ్చినట్లుగా బావించాలి. ఆయన ప్రజల మనిషి ప్రజలలోనే ఉండాలి. రాజకీయాలలో అభివృద్ధిలో పోటీపడాలి తప్ప కక్షలతో జైలులో పెట్టడం ఎంతమాత్రం తగదు. ఆయనను అరెస్ట్ చేసి, ఎలా కేసులు పెట్టాలో అర్ధంకాక వెతుక్కుంటున్నారంటే ఇంతకంటే కక్షకు తార్కాణం ఏముంటుంది. దీనిని అంతా ప్రజలు గమనిస్తున్నారు, సినీ పరిశ్రమ ఎప్పుడూ ఆయన వెంటే ఉంది. ఈ కష్ట కాలంలో కూడా ఆయనకు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. కాకపోతే ఇప్పటివరకు ఎవరికి వారు సొంతంగానే తమ మద్దతు తెలిపారు. అయితే సినీ పరిశ్రమలోని వారు ఒక వేదికగా సంఘీభావాన్ని తెలియజేస్తే బావుంటుందన్న సంకల్పంతో నా ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశాను. అశ్వనీదత్ గారు, కె.రాఘవేంద్రరావు గారు తదితరులు లోకేష్ గారి మీటింగ్ కు వెళారు. ఇంకొంతమంది అందుబాటులో లేక ఫోన్లు చేసి, మరీ తమ సంఘీభావాన్ని ప్రకటించడం ఆనందాయకం. ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందంగా ఉంది” అని అన్నారు.

టి.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు సినీ పరిశ్రమలోని వారు ఎవరికి వారు చంద్రబాబు గారిని అరెస్ట్ ను ఖండిస్తూనే ఉన్నారు. నిరంతరం అభివృద్ధి కోసం పరితపించిన చంద్రబాబు గారి లాంటి ముఖ్యమంత్రి భారతదేశంలోనే మరొకరు లేరు..రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ, విదేశాలలో చంద్రబాబుకు విపరీతమైన సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చంద్రబాబు గారికి సంఘీభావం ప్రకటిస్తూహైదరాబాద్, గచ్చిబౌలి స్టేడియంలో ఐటీ ప్రొఫెషనల్స్ తో పాటు సినీరంగంతో పాటు ఇంకా వివిధ రంగాల ప్రొఫెషనల్స్ పాల్గొనేలా ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారని, దీనిని కూడా విజయవంతం చేయాలి” అని అన్నారు.

కె.ఎల్.దామోదర ప్రసాద్ మాట్లాడుతూ, “ఎన్ఠీఆర్ గారితో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉండేదని, అలాగే చంద్రబాబుతో కూడా మంచి పరిచయం ఉందని, ఆయన లాంటి విజన్ గల నాయకుడు వేరొకరు ఉండరు” అని అన్నారు.

తుమ్మల రామసత్యనారాయణ మాట్లాడుతూ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనపై ఎలాంటి కేసులు పెట్టాలో అర్ధంకాక వెతుక్కోవడం శోచనీయమని అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకులు రాంప్రసాద్, రవికుమార్ చౌదరి, వి.సముద్ర, చంద్రమహేశ్, శివనాగు, నిర్మాతలు ఆచంట గోపినాధ్, ఆర్.కె.భగవాన్,, పల్లె కేశవరావు, ఎస్.వి.రావు, సినిమాటోగ్రాఫర్ జవహర్ రెడ్డి, రచయిత డైమండ్ రత్నబాబు, చిత్రపురి కాలనీ, ఫెడరేషన్ చైర్మన్ వల్లభనేని అనిల్, ఇంకా పలువురు పాల్గొన్నారు.

Related posts